ఐపీఎల్ పదహారో సీజన్ ఫైనల్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఆ టీమ్‌తో చివరి పోరులో తలపడే జట్టేదో ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఫైనల్ రేసులో ఉన్న మూడు జట్లలో ముంబై ఇండియన్స్ ప్రమాదకారి అని చెప్పాడు.
ఐపీఎల్-2023 ఛాంపియన్ ఎవరో మరో మూడు మ్యాచులతో తేలిపోనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. పద్నాలుగు సీజన్లలో పది సార్లు ఫైనల్‌కు చేరిన సీఎస్కే అరుదైన రికార్డును నెలకొల్పింది. ఐపీఎల్లో ఇన్నిసార్లు ఫైనల్‌కు చేరిన మరో జట్టు లేదు. ఇదంతా కేవలం ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని వల్లే సాధ్యమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎక్కువగా విదేశీ ప్లేయర్ల మీద ఆధారపడకుండా బౌలింగ్, బ్యాటింగ్‌లో దేశీయ ప్లేయర్లను నమ్ముకోవడం సీఎస్కేకు కలిసొచ్చింది. ఆటగాళ్లను కొన్నేళ్ల పాటు జట్టులో కొనసాగించడం, వారిని స్టార్లుగా తీర్చిదిద్దడం వల్లే చెన్నై ఇంత బాగా రాణిస్తోంది. జట్టును ఒక కుటుంబంలా చూడటం వారి సక్సెస్ సీక్రెట్‌గా చెప్పుకోవచ్చు. ఈ సీజన్ ఫైనల్స్‌కు ఒక బెర్త్ అయితే ఖాయమైంది. అయితే చెన్నైతో తుదిపోరులో తలపడే జట్టేదో ఇంకా తేలాల్సి ఉంది.
ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే ఎలిమినేటర్‌లో నెగ్గిన జట్టు.. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడాల్సి ఉంటుంది. అందులో గెలిస్తే ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఇప్పుడీ మూడు టీమ్స్‌కు ఫైనల్ వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని గేల్ అన్నాడు. ఒకవేళ ఆ టీమ్ గనుక ఫైనల్‌కు వెళ్లిందా, ట్రోఫీ గెలవకుండా ఆ జట్టును ఆపడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశాడు. గేల్ చెప్పిన దాంట్లోనూ నిజం లేకపోలేదు. ఐపీఎల్లో ముంబై ఇప్పటిదాకా ఆరుసార్లు ఫైనల్స్‌కు వెళ్లింది. అందులో ఒక్కసారి 2010లో సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మిగిలిన 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అంటే ముంబై ఫైనల్‌కు వెళ్తే కప్ ఖాయమనే చెప్పాలి. మరి.. గేల్ కామెంట్స్‌తో మీరు ఏకీభవిస్తారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.