మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. గత మూడేళ్లుగా ముంబై టీమ్‌తో జర్నీ చేస్తున్న అర్జున్‌కు ఎట్టకేలకు పదహారో సీజన్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం లభించింది. అయితే దాన్ని అతడు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఈసారి ఆడియెన్స్‌కు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. భారీస్కోర్లు, ఛేజింగ్‌లతో ప్లేయర్లు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పంచుతున్నారు. అదే సమయంలో గొడవలతో బాహాబాహీకి దిగుతూ వివాదాలతోనూ వైరల్ అవుతున్నారు. టోర్నీ ముగింపు దశకు చేరుకోబోతోంది. దాదాపు అన్ని జట్లు 11 నుంచి 12 మ్యాచ్‌లు ఆడేశాయి. ప్లేఆఫ్స్‌కు టైమ్ దగ్గరపడుతోంది. దీంతో అన్ని టీమ్స్ తమ అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి, నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేందుకు ఎంత తేడాతో నెగ్గాలి తదితర వ్యూహాలతో బిజీ అయిపోయాయి. ముంబై ఇండియన్స్ కూడా ఇదే ప్లాన్స్‌తో ఉంది.
ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇప్పుటిదాకా 11 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో ఆరింట్లో గెలిచి.. ఐదు మ్యాచుల్లో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ముంబై 12 పాయింట్లతో నాలుగో ప్లేసులో ఉంది. మరో మూడు మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకు ప్రతి మ్యాచ్ కూడా కీలకంగా మారింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే రోహిత్ సేన అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిందే. కనీసం రెండింట్లో నెగ్గితే, మిగతా జట్ల గెలుపోటముల ఆధారంగా ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఛాన్సులు ఉంటాయి. ప్రస్తుతం చూస్తే.. ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరే అవకాశం 61 శాతం ఉంది. దీన్ని మెరుగుపర్చుకునేందుకు ముంబై తప్పకుండా ప్రయత్నిస్తుంది. ఆ టీమ్ శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
గుజరాత్‌తో మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని ముంబై భావిస్తోంది. అందుకు జట్టులో కీలక మార్పులు చేయనుందని తెలుస్తోంది. ఇక, ఈ మ్యాచ్‌లోనూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం దక్కకపోవచ్చని సమాచారం. టోర్నీ మొదట్లో అర్జున్‌కు రోహిత్ శర్మ ఛాన్స్ ఇచ్చినా అతడు నిరూపించుకోలేకపోయాడు. ఈ సీజన్లో ముంబై తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అయితే 3 ఓవర్లు వేసి ఏకంగా 48 రన్స్ సమర్పించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఛాన్స్ రాగా.. 13 రన్స్ చేసి ఫర్వాలేదనిపించాడు. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ముంబైకి ప్రతి మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరిగా మారింది. మరోవైపు అవకాశాలు ఇచ్చినప్పుడు బౌలింగ్‌లో అర్జున్ తేలిపోయాడు. దీంతో అతడ్ని తుది జట్టులోకి తీసుకునే ధైర్యం చేయడం లేదు రోహిత్.