ఐపీఎల్-2023లో స్టార్ టీమ్స్ ఫ్యూచర్ ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతుల్లో ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ గనుక ఆ టీమ్స్‌కు షాక్ ఇచ్చిందా ఇక అంతే సంగతులు. ప్లేఆఫ్స్ టెన్షన్లో ఉన్న ఆ జట్లు ఎస్ఆర్హెచ్ గండాన్ని ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నాయి.
ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్‌కు ఎవరు క్వాలిఫై అవుతారనేది మ్యాచ్ మ్యాచ్‌కు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో ప్లేఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించింది. అయితే మిగిలిన మూడు బెర్త్‌ల కోసం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ టీమ్స్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే తదుపరి ఆడబోయే మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంటుంది. మొన్నటి వరకు ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్.. లక్నోపై ఓటమితో పోటీలో వెనుకబడిపోయింది. ఆ జట్టు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గాలి. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడిపోతే మాత్రం ముంబై తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే.
ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఆడిన 12 మ్యాచ్‌ల్లో నాలుగింట్లో నెగ్గిన ఎస్ఆర్హెచ్.. మిగిలిన ఎనిమిదింట్లో ఓడిపోయి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటినా.. ఎస్ఆర్హెచ్ చేతిలో రెండు స్టార్ టీమ్స్ భవిష్యత్ ఆధారడి ఉంది. సన్‌రైజర్స్ తన ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ రెండు టీమ్స్‌కు ప్లేఆఫ్స్ ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లు ఈ జట్లకు చాలా కీలకంగా మారాయి. గెలిస్తే వాటి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కానీ షాక్ ఇచ్చిందా అవి కూడా అస్సాం రైలు ఎక్కాల్సిందే. సన్‌రైజర్స్‌కు కోల్పోయేదేం లేదు కాబట్టి ఈ రెండు మ్యాచ్‌ల్లో చెలరేగి ఆడేందుకు ప్రయత్నించొచ్చు. మరి.. ఎస్ఆర్హెచ్ గండాన్ని ముంబై, ఆర్సీబీ టీమ్స్ ఎలా అధిగమిస్తాయో చూడాలి.