ఆర్సీబీ-సీఎస్కే జట్టు ఎప్పుడు తలపడినా చూసేందుకు అభిమానులు రెడీగా ఉంటారు. ఈ దక్షిణాది జట్ల పోరాటం కొదమసింహాల కొట్లాటను తలపిస్తుంది. సోమవారం రాత్రి మరోమారు ఇది నిరూపితమైంది.
ఐపీఎల్ హాట్ ఫేవరెట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును దురదృష్టం వెంటాడుతోంది. ప్రతిసారి బలమైన జట్టుతో బరిలోకి దిగడం, టైటిల్‌పై ఆశలు చిగురింపజేయడం.. తీరా సరైన సమయంలో చేతులెత్తేయడం ఆర్సీబీకి పరిపాటిగా మారింది. హార్డ్ హిట్టర్లు, బలమైన బ్యాటింగ్ లైనప్‌తో ఈసారి కూడా సమతూకంతో కనిపిస్తున్న బెంగళూరు టీమ్.. వరుస పరాజయాలను మూటగట్టుకుంటోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 8 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఒక దశలో మ్యాచ్ ఆర్సీబీదేనని అందరూ అనుకున్నా.. కీలక దశలో గెలుపు ముంగిట ఆ జట్టు బోల్తా కొట్టింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 226 రన్స్ చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ 8 వికెట్ల కోల్పోయి 218 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో సారథి డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (76) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని తన ప్రశాంతతను కోల్పోయాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూల్‌గా కనిపించే ధోని.. ఫీల్డింగ్‌లో అలసత్వం వహించిన మొయిన్ అలీ మీద కోపంతో ఊగిపోయాడు. 18వ ఓవర్లో పతిరానా బౌలింగ్‌లో పార్నెల్ ఎక్స్ట్రా కవర్ దిశగా షాట్ కొట్టాడు.
పార్నెల్ కొట్టిన బాల్ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మెయిన్ అలీ చేతుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో పార్నెల్ ఒక్క రన్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ప్రభుదేశాయ్ మాత్రం పార్నెల్‌ను గమనించలేదు. పార్నెల్ గట్టిగా వద్దనడంతో ప్రభుదేశాయ్ వికెట్ కీపర్ వైపు పరిగెత్తాడు. అయితే మొయిన్ అలీ బాల్‌ను సరిగ్గా అందుకోలేకపోయాడు. అంతేకాకుండా తన పక్కనే ఉన్న బాల్‌ను కీపర్‌కు త్రో చేయకుండా బద్దకంగా వ్యవహరించాడు. ఒకవేళ బాల్‌ను అందుకుని కీపర్‌కు త్రో చేసి ఉంటే ప్రభుదేశాయ్ ఔటయ్యేవాడు. మొయిన్ పేలవ ఫీల్డింగ్‌పై ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోపంతో అతడి వైపు చూస్తూ ఏదో అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
— Billu Pinki (@BilluPinkiSabu) April 18, 2023