చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుతం చేసింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన సీఎస్కే.. ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పద్నాలుగు ఐపీఎల్ సీజన్లలో చెన్నై ఫైనల్‌కు చేరడం ఇది పదోసారి కావడం విశేషం.
చెన్నై సూపర్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్లో మరోసారి అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో 15 రన్స్ తేడాతో సూపర్బ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది ధోని సేన. రుతురాజ్ గైక్వాడ్ (60), కాన్వే (40) రాణించడంతో తొలుత సీఎస్కే 7 వికెట్లకు 172 రనర్స్ చేసింది. షమి, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 157 రన్స్‌కే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, తీక్షణ, దీపర్ చాహర్ తలో రెండు వికెట్లతో టైటాన్స్ పతనాన్ని శాసించారు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (42), రషీద్ ఖాన్ (30) ఫర్వాలేదనిపించారు. ఈ ఓటమితో కుంగిపోయిన గుజరాత్‌కు ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడుతుంది టైటాన్స్. ఒకవేళ అందులో గనుక నెగ్గితే ఫైనల్స్‌లో సీఎస్కేతో ఆడొచ్చు.
గుజరాత్‌పై గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఒక వార్త భయపెట్టిస్తోంది. మే 28న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు సారథి ఎంఎస్ ధోని ఆడేది అనుమానంగా మారింది. అతడిపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. క్వాలిఫైయర్-1లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన విషయం విదితమే. దీని వల్ల అతడు 4 నిమిషాల టైమ్ వృథా చేశాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ.. ధోని మీద ఫైన్ లేదా బ్యాన్ విధించే ఛాన్స్ ఉందని ఒక ప్రముఖ క్రీడా వెబ్సైట్ తెలిపింది. ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ధోనీపై నిషేధం విధిస్తే ఫైనల్‌కు ముందు సీఎస్కే భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి.
ధోని విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం రిఫరీకే ఉంటుంది. అసలేం జరిగిందంటే.. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు చెన్నై పేసర్ మతీషా పతిరాణా తయారయ్యాడు. కానీ అతడు బౌలింగ్ చేసేందుకు ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, అనిల్ చౌదరి ఒప్పుకోలేదు. ఈ ఓవర్ వేయడానికి ముందు పతిరాణా దాదాపు 9 నిమిషాల పాటు గ్రౌండ్లో లేడు. దీంతో నేరుగా డగౌట్ నుంచి వచ్చిన పతిరాణాను బౌలింగ్ చేయకుండా అంపైర్లు అడ్డుకున్నారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. 8 నిమిషాల పాటు మైదానంలో లేని ఆటగాడు వచ్చి బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయడం కుదరదు. అయితే ధోని వచ్చి అంపైర్లను ఒప్పించడంతో పతిరాణా ఆ ఓవర్‌ను కొనసాగించాడు. ఈ విషయంలో రిఫరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
MS Dhoni to be banned for IPL 2023 Final? CSK skipper intentionally waste time in Qualifier 1 with umpires#IPL2023 #MSDhoni #Qualifier1 #CSKvGT https://t.co/sSY9YXqxf9
— InsideSport (@InsideSportIND) May 24, 2023