టీమిండియాకు దొరికిన ఆణిముత్యాల్లో పేసర్ మహ్మద్ సిరాజ్ ఒకడని కచ్చితంగా చెప్పొచ్చు. పేస్, స్వింగ్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే సిరాజ్.. ఐపీఎల్‌లోనూ తన ప్రతాపం చూపిస్తున్నాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బ్యాటర్లకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో సిరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి తన ప్రతాపం చూపించాడీ రైటార్మ్ పేసర్. 4 ఓవర్లలో 24 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. సిరాజ్ దెబ్బకు పంజాబ్ బ్యాటర్లు వణికిపోయారు. ఇన్నింగ్స్ ఆరంభంలో కొత్త బాల్‌తో ప్రత్యర్థిని దెబ్బకొట్టిన సిరాజ్.. ఓల్డ్ బాల్‌తోనూ పంజాబ్ పనిపట్టాడు. ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 రన్స్ చేసింది. డుప్లెసిస్ (84), కోహ్లీ (59) ఫస్ట్ వికెట్‌కు 137 రన్స్ జోడించారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ (2/31) ఆకట్టుకున్నాడు.
లక్ష్య ఛేదనలో సిరాజ్ పంజాబ్‌ను హడలెత్తించాడు. ఇన్నింగ్స్ రెండో బాల్కే ఓపెనర్ అథర్వ (4)ను ఔట్ చేశాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్ (2)ను సిరాజ్ కుదురుకోనీయలేదు. ఇన్ స్వింగింగ్ డెలివరీతో అతడ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సిరాజ్‌తో పాటు హసరంగ, అలాగే మిగిలిన బౌలర్లు కూడా రాణించడంతో పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 150 రన్స్‌కు ఆలౌట్ అయింది. గాయం నుంచి కోలుకుంటున్న శిఖర్ ధావన్ లేకపోవడం ఆ జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. ఇకపోతే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డేలతో పాటు ఐపీఎల్‌లోనూ రాణించడంపై హర్షం వ్యక్తం చేశాడు.
‘వన్డేల్లో నా బౌలింగ్ రిథమ్ బాగుంది. 50 ఓవర్ల ఫార్మాట్లో రాణించడంతో ఆత్మవిశాసాన్ని నింపుకున్నా. దాన్నే ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నా. పవర్ ప్లేలో వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తా. ఇన్నింగ్స్ ఆరంభంలో వికెట్లు పడితే ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలో కూరుకుపోతుంది. నేను మంచి ఫీల్డర్‌ను. అయితే ఫీల్డింగ్‌లో పదే పదే తప్పులు చేసేవాడ్ని. కానీ నిరంతరం మెరుపడటంపై దృష్టి పెడుతున్నా. జట్టు గెలుపులో నా వంతు కృషి చేస్తున్నా. నా బౌలింగ్ మెరుగుపడటానికి కరోనా లాక్డౌన్ టైమ్‌లో పడిన కష్టమే కారణం. అంతకుముందు వరకు నా బౌలింగ్‌లో ఎక్కువ రన్స్ వచ్చేవి. కానీ జిమ్‌లో చెమటోడ్చా. బౌలింగ్ లోపాలను సరిదిద్దుకున్నా’ అని సిరాజ్ తన సక్సెస్ సీక్రెట్ చెప్పేశాడు.