చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ పేసర్ పతిరానా తన బౌలింగ్ టాలెంట్‌తో ఈ సీజన్లో అదరగొట్టాడు. అయితే అతడిలో పేస్ బౌలింగ్‌తో పాటు మరో ప్రతిభ కూడా దాగి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఫైనల్స్‌కు చేరుకున్న ఆ జట్టు.. కప్‌తోనే సీజన్‌ను ముగించాలని భావిస్తోంది. అయితే ఫైనల్స్ వరకు సీఎస్కే జర్నీ ఏమంత సులువుగా సాగలేదు. పెద్దగా స్టార్లు లేకపోయినా, యువ ఆటగాళ్లను పెట్టుకొని చెన్నై టైటిల్ తుది మెట్టు వరకు చేరుకుంది. దీని వెనుక మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ మాయాజాలం, వ్యూహ చతురత ఉంది. అందుబాటులో ఉన్న బౌలింగ్, బ్యాటింగ్ వనరులను అద్భుతంగా వినియోగించుకున్నాడు ధోని. ప్రతిభ కలిగిన యువ ప్లేయర్లకు అండగా నిలుస్తూ వారిని మ్యాచ్ విన్నర్లుగా తయారు చేశాడు ధోని. అందుకే బౌలింగ్‌లో మతీష పతిరానా, తుషార్ దేశ్‌పాండే లాంటి యంగ్ పేసర్స్ తమలోని టాలెంట్‌ను చాటుకొని సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో బాగా పేరు తెచ్చుకున్న ఆటగాళ్లలో మహీష పతిరానా ఒకడు. అచ్చం శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ లాంటి శైలితో బౌలింగ్ వేసే పతిరానా సీఎస్కే విజయాల్లో తనదైన పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో వికెట్లు తీయడంతో పాటు రన్స్‌ను బాగా కట్టడి చేశాడు. పేస్‌ను నియంత్రిస్తూ, స్లో బాల్స్, యార్కర్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను షాట్లు కొట్టడకుండా చేయడంలో ఆరితేరాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 17 వికెట్లు తీశాడు పతిరానా. శ్రీలంక బౌలింగ్ ఫ్యూచర్ స్టార్‌గా చెబుతున్న పతిరానాలో మరో క్రేజీ టాలెంట్ కూడా ఉంది. అదే సింగింగ్. అవును, పతిరానా అద్భుతంగా పాడగలడు. ఒక కార్యక్రమంలో అతడు పాడుతున్న వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పతిరానా పాడుతుండగా.. పక్కన మరో సీఎస్కే బౌలర్ మహీష్ తీక్షణ పాటను ఆస్వాదిస్తున్నాడు. మరి.. పతిరానాలో దాగి ఉన్న ఈ ప్రతిభ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.