క్రికెట్లో ఎల్ఈడీ స్టంప్స్ వినియోగం గత ఆరేడేళ్లలో బాగా పెరిగింది. ఐసీసీ ట్రోఫీలతో పాటు ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ లీగ్స్‌లోనూ వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ స్టంప్స్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే.
క్రికెట్లో ఒకప్పుడు మామూలు స్టంప్స్‌ను వాడేవారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ సాంకేతికత అభివృద్ధి చెందింది. దీంతో ఎల్ఈడీ స్టంప్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే స్టంప్స్ దగ్గర కెమెరా, మైక్ పెట్టే సదుపాయం కూడా వచ్చేసింది. థర్డ్ అంపైర్ తన నిర్ణయాలను మరింత సులభంగా, కచ్చితత్వంతో తీసుకునేందుకు ఎల్ఈడీ స్టంప్స్ బాగా సాయపడుతున్నాయి. ఇంతకుముందు వరకు ఉన్న మామూలు స్టంప్స్ వల్ల కొన్ని సందర్భాల్లో నిర్ణయాన్ని వెల్లడించడంలో థర్డ్ అంపైర్ ఎక్కువ సమయం తీసుకునేవారు. అయితే టెక్నాలజీ రాకతో ఈ జాప్యానికి ఫుల్ స్టాప్ పడింది. ఐసీసీ ఎల్ఈడీ స్టంప్స్ వాడకాన్ని మొదలుపెట్టడంతో వికెట్, రనౌట్, స్టంప్ ఔట్ నిర్ణయాలు తీసుకోవడం అంపైర్, థర్డ్ అంపైర్‌కు ఈజీ అయిపోయింది.
తొలుత 2014 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచుల సమయంలో ఎల్ఈడీ స్టంప్స్‌ను వినియోగించారు. ఆ తర్వాత ఐపీఎల్లోకీ ఇవి వాడుకలోకి వచ్చాయి. ధర ఎక్కువైనా కచ్చితమైన నిర్ణయాలు వస్తుండటంతో వీటినే వాడాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఒక్కో ఎల్ఈడీ స్టంప్ సెట్ ధర దాదాపుగా రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉంటుందట. ఒక మ్యాచ్‌లో వినియోగించిన రెండు సెట్లను కలిపితే వీటి ధర రూ.50 నుంచి రూ.70 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ఈ స్టంప్స్ పనితీరు అనేది బెయిల్స్‌లో దాగి ఉంటుంది. వీటిల్లో బ్యాటరీలు, ఒక మైక్రోప్రాసెసర్ కూడా ఉంటుంది. స్టంప్తో కనెక్షన్ ఉన్నంత సేపు వికెట్లు, బెయిల్స్‌కు ఉన్న ఎల్ఈడీ బల్బులు వెలగకుండా ఉంటాయి. ఎప్పుడైతే వాటికి బాల్ తగులుతుందో అప్పుడు సర్క్యూట్ బ్రేక్ అయి వెంటనే బల్బ్స్ వెలుగుతాయి. ఐపీఎల్లో కొందరు ఆటగాళ్ల జీతాలు, అలాగే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్ మనీ లాంటి వాటితో పోలిస్తే ఎల్ఈడీ స్టంప్ ధరలు ఎంతో ఎక్కువ అని చెప్పొచ్చు.