ఐపీఎల్ అంటే వెస్టిండీస్ ప్లేయర్లకు ఎక్కడా లేని పూనకం వస్తుంది. హిట్టింగ్ చేయగలిగే ప్లేయర్లు చాలా మంది ఉన్నప్పటికీ.. విండీస్ ప్లేయర్లు మాత్రం తమకే సాధ్యం అన్నట్లుగా భారీ సిక్సర్లతో విరుచుకుపడతారు. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచులో మేయర్స్ ఒక భారీ సిక్సర్ తో అందరినీ ఆశ్చర్యంలో పడేసాడు.
ఐపీఎల్ అంటే వెస్టిండీస్ ప్లేయర్లకు ఎక్కడా లేని పూనకం వస్తుంది. గతంలో గేల్, పోలార్డ్, రస్సెల్, సిమ్మన్స్ ,డ్వెయిన్ స్మిత్ లాంటి వారు పవర్ హిట్టింగ్ చేస్తూ ఈ మెగా లీగ్ లో వారిదైనా ముద్ర వేశారు. హిట్టింగ్ చేయగలిగే ప్లేయర్లు చాలా మంది ఉన్నప్పటికీ.. విండీస్ ప్లేయర్లు మాత్రం తమకే సాధ్యం అన్నట్లుగా భారీ సిక్సర్లతో విరుచుకుపడతారు. ఈ లక్షణమే వీరిని ఈ లీగ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిపింది. అయితే ఈ సీజన్లో చాలా మంది విండీస్ ప్లేయర్లు దూరమవ్వడం.. రస్సెల్ కూడా ఏమంత ఫామ్ లో లేకపోవడం వలన ఈ సారి కరీబియన్ల హవా అంతగా ఉండదని భావించారంతా. కానీ ఆ లోటుని ఇప్పుడు విండీస్ వీరుడు కైల్ మేయర్స్ ఆ లోటు తీర్చే పనిలో ఉన్నాడు.
ఐపీఎల్ లో ఈసారి విండీస్ ప్లేయర్లు ఎప్పుడూ లేని విధంగా చాలా తక్కువమంది ఉండడం గమనార్హం. ప్రస్తుతం కైల్ మేయర్స్ , పూరన్ రాహుల్ సారధ్యంలోని లక్నో జట్టుకి ఆడుతూ రాణిస్తున్నారు. ముఖ్యంగా మేయర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి విధ్వంసం సృష్టించాడు. ఇందులో భాగంగా మేయర్స్ కొట్టిన ఒక భారీ సిక్సర్ వావ్ అనేలా ఉంది. గర్నూర్ బ్రార్ వేసిన మూడో ఓవర్లో మూడో బంతి నోబాల్ వేయగా ఫ్రీ హిట్ వచ్చింది. ఇక ఈ బంతిని స్లో బాల్ గా వేసిన బ్రార్ విండీస్ ఓపెనర్ భారీ సిక్సర్ కి తరలించాడు. దీంతో ఒక్కసారిగా డగౌట్ లో కూర్చున్న లక్నో ప్లేయర్లు అలాగే చూస్తూ షాక్ లో ఉండిపోయారు. ప్రస్తుతం వీరి రియాక్షన్ వైరల్ గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో జట్టు 56 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాహుల్ సేన ఏకంగా 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. మేయర్స్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా .. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా బ్యాట్ ఝళిపించడం విశేషం. ఇక భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. అథర్వ తైదే హాఫ్ సెంచరీతో రాణించగా సికిందర్ రాజా పర్వాలేదనిపించాడు. మిగిలిన వారు విఫలమవడంతో పంజాబ్ కి ఓటమి తప్పలేదు. మొత్తానికి భారీ సిక్సర్లు కొట్టడంలో విండీస్ ప్లేయర్ల తర్వాతే అని మేయర్స్ మరోసారి నిరూపించాడు. మరి మేయర్స్ కొట్టిన సిక్సర్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
It’s Diwali in Mohali, courtesy Kyle Mayers 🔥🎇🎆#IPLonJioCinema #TATAIPL #PBKSvLSG pic.twitter.com/1MLi05NlBj
— JioCinema (@JioCinema) April 28, 2023