వరుసగా రెండు మ్యాచులు గెలిచి మంచి ఊపు మీద ఉన్న బెంగళూరు జట్టుకి నిన్న కోల్ కథ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో కోల్ కథ మీద కోహ్లీ సేన ఒక చెత్త రికార్డ్ నమోదు చేసుకుంది. ఆ రికార్డ్ ఏంటంటే ?
ఐపీఎల్ లో బెంగళూరు జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతుంది. మరీ అదరగొట్టే ప్రదర్శన చేయకపోయినా.. పర్వాలేదనిపిస్తుంది. నిన్నటివరకు సగం మ్యాచులు(7) పూర్తయ్యేసరికి 4 విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేస్ లో ఒక అడుగు ముందుకు వేసింది. ఇక నిన్న జరిగిన మ్యాచులో సొంతగడ్డపై ఆర్సీబీ అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. చిన్నస్వామి స్టేడియంలో మంచి రికార్డ్ ఉన్న బెంగళూరు జట్టు కోల్ కథ చేతిలో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. నిన్నటి మ్యాచులో ఓటమి ఇప్పుడు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సొంతగడ్డపై ఒక చెత్త రికార్డ్ ని నమోదు చేసుకుంది.
సొంత గడ్డపై ఏ జట్టైనా రాణిస్తుంది. ఐపీఎల్ కాబట్టి ఓ మ్యాచ్ ఓడిపోయినా.. ఆ తర్వాత కమ్ బ్యాక్ ఇవ్వడం మామూలే. కానీ బెంగళూరు జట్టు వరుసగా సొంతగడ్డపై 5 మ్యాచులు ఓడిపోవడం గమనార్హం. అదేంటి బెంగళూరు సొంత గడ్డపై గత మ్యాచులో రాజస్థాన్ మీద గెలిచింది కదా అనుకుంటే పొరబాటే. ఎందుకంటే బెంగళూరు వరుసగా 5 మ్యాచులు ఓడిపోయింది కేకేఆర్ చేతిలో. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ చెత్త రికార్డ్ ఆర్సీబీకే దక్కింది. చివరి 5 మ్యాచులు గమనిస్తే చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు మీద కేకేఆర్ రికార్డ్ 5-0 గా ఉంది. అంతే కాదు ఈ ఐపీఎల్ లో కోల్ కత్తా లో జరిగిన మ్యాచులో కూడా ఆర్సీబీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై మంచి రికార్డ్ ఉన్న బెంగళూరు జట్టు కేకేఆర్ విషయంలోనే ఇలా జరగడం దురదృష్టకరం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రాయ్(56) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ జగదీశన్(27) అతనికి మంచి సహకారం లభించాడు. ఇక చివర్లో కెప్టెన్ నితీష్ రానా(48), వెంకటేష్ అయ్యర్(31) చెలరేగి ఆడడంతో కోహ్లీసేనకు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ కోహ్లీ(54) మినహా ఎవరూ కూడా రాణించలేదు. లోమరోర్(32) పర్వాలేదనిపించినా.. కీలక దశలో ఔటయ్యి నిరాశపరిచాడు. ఇక చివర్లో ఆదుకుంటాడనుకున్న దినేష్ కార్తిక్(22) కూడా చేతులెత్తేయడంతో బెంగళూరుకి ఓటమి తప్పలేదు. మరి సొంతగడ్డపై ఆర్సీబి..కేకేఆర్ చేతిలో వరుసగా ఇలా ఓడిపోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.