ఈసారి ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ దూసుకుపోతోంది. ఆడిన 6 మ్యాచుల్లో నాలుగింట గెలిచిన కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో టీమ్.. ప్లేఆఫ్స్ బెర్త్‌పై కన్నేసింది.
ఐపీఎల్ పదహారో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దూసుకెళ్తోంది. వరుస విజయాలతో ప్రత్యర్థి టీమ్స్‌కు సవాల్ విసురుతోంది. పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 10 రన్స్ తేడాతో గెలిచి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (32 బాల్స్‌లో 39), కైల్ మేయర్స్ (42 బాల్స్‌లో 51) ఆకట్టుకున్నారు. స్టొయినిస్ (21), పూరన్ (29) కూడా రాణించారు. రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు 150 దాటుతుందా అని అనిపించింది. కానీ పూరన్ హిట్టింగ్తో మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన రాజస్థాన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది.
యశస్వి జైస్వాల్ (44), జోస్ బట్లర్ (41) రాయల్స్‌కు శుభారంభాన్ని అందించారు. అయితే దీన్ని ఆ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగాడు. స్టొయినిస్, నవీన్ ఉల్ హక్ చెరో రెండు వికెట్లతో రాజస్థాన్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. మధ్యలో కాస్త నెమ్మదిగా ఆడటంతో ఇన్నింగ్స్ చివర్లో కొట్టాల్సిన స్కోరు పెరిగిపోయింది. పడిక్కల్, రియాన్ పరాగ్ హిట్టింగ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక, మ్యాచ్ గెలిచిన అనంతరం లక్నో సారథి కేఎల్ రాహుల్ ఫన్నీగా చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఫీల్డింగ్ చేస్తున్న టైమ్‌లో సహచరులు విసిరిన ఒక త్రో కారణంగా రాహుల్ మోచేతికి స్వల్ప గాయమైంది. దీనిపై రాహుల్ మాట్లాడుతూ.. ‘సహచరులు విసిరిన త్రో వల్ల చిన్న గాయమైంది. దీని గురించి అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఆ సమయంలో నాకో విషయం స్పష్టమైంది. సారథిగా నేనేదో తప్పు చేస్తున్నట్లున్నాను. అందుకే సహచరులు నన్ను బాల్‌తో ఒకటి పీకి అలర్ట్ చేశారేమో’ అని నవ్వుతూ చెప్పాడు రాహుల్. అతడి వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. రాహుల్‌కు ఒకటి పీకి చెబితే గానీ అతడి బుర్రకెక్కదు అంటున్నారు. కేఎల్ జిడ్డు బ్యాటింగ్‌తో విసుగిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. బౌలర్ల పుణ్యమా అని బయటపడ్డారు కానీ.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఓడిపోయేవాళ్లని మరికొందరు అంటున్నారు.