ఒకప్పుడు 14 బంతుల్లో హాఫ్ సెంచరీ కానీ ప్రస్తుతం మెయిడిన్ ఓవర్ ఆడేస్తున్నాడు. ఐపీఎల్ లాంటి మెగా ఈవెంట్ లో జిడ్డు బ్యాటింగ్ ఆడుతూ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. అప్పుడు పొగిడిన వారే ఇప్పుడు విమర్శిస్తున్నారు. అతడే లక్నో కెప్టెన్ రాహుల్.
ఐపీఎల్ అంటే అభిమానులు ఫోర్లు, సిక్సులు కోరుకుంటారు. ఎవరైనా జిడ్డు బ్యాటింగ్ చేస్తే అస్సలు ఊరుకోరు. పరిస్థితులని బట్టి కాసేపు నిదానంగా ఆడితే పర్వాలేదు. కానీ ప్రతి మ్యాచ్ లో ఇలాంటి ప్రదర్శన చేస్తే విమర్శలు తప్పవు. ప్రస్తుతం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ పరిస్థితి ఇలాగే ఉంది. అంతర్జాతీయ మ్యాచుల్లో ఎలా ఆడినా ఐపీఎల్ లో రాహుల్ పరుగుల వరద పారిస్తాడనే పేరుంది. దానికి తగ్గట్లే ప్రతి సీజన్ లో రాహుల్ 500 కి పైగా పరుగులు సాధిస్తూ ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటాడు. కానీ ఐపీఎల్ 2023 సీజన్ లో రాహుల్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పరుగులు చేయడంలోనే కాదు వేగంగా ఆడడంలోనూ రాహుల్ విఫలమవుతున్నాడు. దీంతో ఇప్పుడు ఈ క్లాసికల్ బ్యాటర్ మీద విమర్శలు ఎక్కువవుతున్నాయి.
“పవర్ ప్లే లో రాహుల్ బ్యాటింగ్ చూస్తుంటే పరమ బోరింగ్ గా ఉంది. ఐపీఎల్ లో ఇంత బోరింగ్ గా ఎప్పుడూ అనిపించలేదు”. ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ రాహుల్ మీద బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేసాడు. ఇది కేవలం పీటర్సన్ అభిప్రాయం మాత్రమే కాదు. ప్రతి క్రికెట్ అభిమానులది. రాహుల్ బ్యాటింగ్ చూస్తుంటే ఆడుతుంది టీ 20 మ్యాచ్ అనే సంగతి మర్చిపోయినట్టున్నాడు. పవర్ ప్లే లో తన జిడ్డు బ్యాటింగ్ తో అందరి సహనాన్ని పరీక్షిస్తున్నాడు. నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 32 బంతుల్లో 39 పరుగులు మాత్రమే చేసాడు. అంతేకాదు బోల్ట్ వేసిన మొదటి ఓవర్ మేడిన్ ఆడేశాడు. క్రమంగా రాహుల్ తన బ్యాటింగ్ లోని వేగాన్ని తగ్గించేస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి రాహుల్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ 109 కాగా .. గతేడాది 104 మాత్రమే.
ఇక పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రాహుల్ 56 బంతుల్లో 74 పరుగులు మాత్రమే చేసాడు. మ్యాచ్ లు గెలుస్తున్నారు కాబట్టి సరిపోతుంది. లేకపోతే పరిస్థితి వేరుగా ఉండేది. పిచ్ బ్యాటింగ్ కి సహకరిస్తే తప్ప రిస్క్ చేయడానికి అసలు ఆసక్తి చూపించట్లేదు. ఐపీఎల్ లో రాహుల్ కి 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టిన రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. కానీ ప్రస్తుతం రాహుల్ బ్యాటింగ్ చూస్తుంటే ఇదేమి బ్యాటింగ్ రా బాబు అంటున్నారు నెటిజన్స్. ప్రారంభంలో కాస్త టైం తీసుకున్నా.. ఆ తర్వాత బ్యాట్ ఝళిపిస్తే పర్వాలేదు. కానీ రాహుల్ ఇన్నింగ్స్ అంతా ఒకేలా సాగుతుంది. ఇలాగైతే మరిన్ని విమర్శలు మూట కట్టుకోవడం ఖాయం.