చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని రిటైర్మెంట్ మీద ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనిపై ఒక టీమిండియా స్టార్ బ్యాటర్ స్పందించాడు. ధోనీకి వయసు పెరుగుతోందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
భారత క్రికెట్‌ను సారథిగా పరుగులు పెట్టించిన ఘనత మహేంద్ర సింగ్ ధోనీకే దక్కుతుంది. అతడి నాయకత్వంలో జట్టు చాన్నాళ్లుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్‌ను కూడా ఒడిసిపట్టింది. టెస్టుల్లోనూ నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అయితే 2019 ప్రపంచ కప్ ఓటమి తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు మాహీ గుడ్ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడనప్పటికీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అభిమానులకు వినోదాన్ని పంచుతూనే ఉన్నాడు. కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌ను ముందుండి నడిపిస్తూనే.. హిట్టర్‌గా జట్టుకు విజయాలను చేకూరుస్తున్నాడు. అయితే వయసు పెరుగుతున్న నేపథ్యంలో అతడి ఐపీఎల్ రిటైర్మెంట్ మీద కూడా చర్చ మొదలైంది.
ఐపీఎల్‌కు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో ధోని స్పష్టంగా చెప్పలేదు. అయితే తాను హోం గ్రౌండ్‌గా భావించే చెన్నైలో చివరి మ్యాచ్ ఆడతానని మాత్రం ఒక సందర్భంలో అన్నాడు. ఇదిలా ఉండగా.. ధోని రిటైర్మెంట్ పై సీఎస్కే మాజీ ప్లేయర్, టీమిండియా బ్యాటర్ కేదార్ జాదవ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ధోనీకి వయసు పెరుగుతోందని.. అతడిపై ఒత్తిడి ఎక్కువవుతోందని జాదవ్ తెలిపాడు. ఇక మీదట క్రికెట్ ఆడేందుకు అతడి శరీరం సహకరించకపోవచ్చునన్నాడు. బహుశా ఇదే అతడికి ఆఖరి ఐపీఎల్ కావొచ్చని జాదవ్ పేర్కొన్నాడు. ఎంఎస్ ధోని లేకుండా సీఎస్కే ఎలా ఉండబోతోందనేదే ఇంట్రెస్టింగ్ విషయమన్నాడు. మరి.. ధోని రిటైర్మెంట్ విషయంలో కేదార్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.