టెస్టుల్లో బ్యాట్స్‌మన్ రాణించాలంటే ఓపికతో బ్యాటింగ్ చేయాలి. గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోవాలి. స్పిన్, పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఒక్కో రన్ చేస్తూ భాగస్వామ్యాలు నెలకొల్పాలి. దీనికి ఎంతో ప్రతిభ, అనుభవం అవసరం.
ఒకప్పుడు భారత జట్టులో చోటు సంపాదించాలంటే దేశవాళీ క్రికెట్ కొలమానంగా ఉండేది. రంజీలు, విజయ్ హజారే లాంటి ట్రోఫీల్లో సత్తా చాటిన యువ క్రికెటర్లకు టీమిండియాలో ఛాన్స్ ఇచ్చేవారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాకతో సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు భారత జట్టులో చోటు కావాలంటే ఐపీఎల్లో రాణించాల్సిందే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇందులో రాణిస్తున్న ఆటగాళ్లకు సెలెక్టర్లు భారత జట్టులోకి ఎంపిక చేస్తున్నారు. అయితే టీ20లు, వన్డేలకు ఐపీఎల్లో సక్సెస్ అయిన ప్లేయర్లను ఎంపిక చేస్తే ఓకే. కానీ టెస్టులకు కూడా ఈ టోర్నీలో బాగా ఆడిన వారికే ఛాన్స్ ఇవ్వడం కాస్త వివాదాస్పదంగా మారింది.
టెస్టుల్లో గింగిరాలు తిరిగే బంతులు, ఛాతీ ఎత్తుకు దూసుకొచ్చే బౌన్సర్లు, పరీక్ష పెట్టే స్వింగింగ్ డెలివరీలను ఎదుర్కోవాలంటే బ్యాట్స్‌మన్ ఎంతో రాటుదేలి ఉండాలి. అందుకే దేశవాళీల్లో రాణించాలి. రంజీ ట్రోఫీ లాంటి టెస్టు ఫార్మాట్ టోర్నీల్లో అదరగొట్టాలి. కానీ ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ను దృష్టిలో ఉంచుకుని టెస్టుల్లో జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఇవ్వడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. త్వరలో జరగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడే భారత జట్టులో ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. ఐపీఎల్‌లోనే గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు.
రాహుల్ ప్లేసులో ఎవర్ని ఎంపిక చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ సెలెక్టర్లు అందరికీ షాక్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు. రంజీల్లో గత రెండు సీజన్లలో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్రతిభావంతుడ్ని కాదని ఇషాన్‌కు ఛాన్స్ ఇచ్చారు. టన్నుల కొద్దీ రన్స్ చేస్తున్నా సర్ఫరాజ్ ఖాన్‌ను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. 37 మ్యాచుల్లో 54 ఇన్నింగ్స్ ఆడి.. 3,505 రన్స్ చేశాడు సర్ఫరాజ్. 80కి పైగా యావరేజ్‌తో ఉన్న అతడ్ని డొమెస్టిక్ డాన్ బ్రాడ్‌మన్ అని పిలుస్తుంటారు. ఒక ట్రిపుల్ సెంచరీ సహా 13 సెంచరీలు కొట్టిన సర్ఫరాజ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అవకాశం ఉన్నా ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
దేశవాళీల్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ అంటే బీసీసీఐకి పడదని.. ఎందుకంటే అతడు ఐపీఎల్లో ఆడడు కదా అని ఫ్యాన్స్ అంటున్నారు. ఐపీఎల్లో 10 బాల్స్‌లో 20 రన్స్ చేసిన ఆటగాడు గొప్పేమో కానీ.. దేశవాళీ క్రికెట్లో ఎంత బాగా ఆడినా వారికి చిన్నచూపేనని చెబుతున్నారు. భారత జట్టులోకి రావడానికి ఐపీఎల్ మాత్రమే కొలమానమైతే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎందుకు కొనసాగిస్తున్నారని, పీకిపారేయాలని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వన్డేల్లో నిలకడలేమితో సతమతమవుతున్న ఇషాన్ కిషన్‌ను టెస్టుల్లో ఎందుకు సెలెక్ట్ చేశారో ఒక్క కారణమైనా చెప్పాలని భారత జట్టు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.