ఐపీఎల్ అంటే స్పాట్ ఫిక్సింగా ? ప్రస్తుతం జరుగుతున్న మ్యాచులని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అనూహ్య ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఇందులో నిజమెంత?
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ అభిమానులకి ఫుల్ కిక్ ఇస్తోంది. మ్యాచులన్నీ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తున్నాయి. గత రెండు వారాలు చూసుకుంటే మ్యాచులన్నీ దాదాపు చివరి ఓవర్ వరకు వెళ్తున్నాయి. స్టార్ ఆటగాళ్ల గాయాలతో ఈసారి ఐపీఎల్ కాస్త కళ తప్పుతుందేమో అని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఈసారి చాలా వరకు థ్రిల్లింగ్ మ్యాచ్ లు జరగడం విశేషం. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచుల్లో ఊహించిన ఫలితాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక గెలుపు ఖాయమనుకుంటున్న జట్లకు అనూహ్య ఓటములు తప్పట్లేదు. ఒకటి, రెండు మ్యాచులు ఇలా జరగడంలో ఆశ్చర్యం లేకపోయినా సగానికి పైగా మ్యాచుల్లో.. గెలుస్తాయి అనుకున్న జట్లు ఓడిపోతుండడం సగటు క్రికెట్ అభిమానిని ఆలోచించేలా చేస్తోంది.
ఐపీఎల్ అంటే క్యాష్ లీగ్. స్వదేశీ, విదేశీ అనే తేడా లేకుండా ప్లేయర్ ఎవరైనా ఈ మెగా లీగ్ ఆడడానికి ఆసక్తి చూపిస్తారు. కోట్లలో డబ్బుతో పాటుగా నిరూపించుకుంటే మంచి పేరు కూడా వస్తుంది. కేవలం ప్లేయర్లకే కాదు బీసీసీఐకి కూడా ఐపీఎల్ వలన భారీ మొత్తంలో లాభం వస్తుంది. అయితే.. ఇలాంటి మెగా లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి వ్యవహారాలూ జరుగుతూ ఉంటాయని గతంలో నిరూపితమైంది. రాజస్థాన్ ప్లేయర్లు శ్రీశాంత్, చండీలా, చవాన్.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీంతో రాజస్థాన్, చెన్నై జట్లను రెండు సంవత్సరాల పాటు నిషేధించారు. ఇక అప్పటి నుంచి ఐపీఎల్ అంటే ఇలా స్పాట్ ఫిక్సింగ్ లు కూడా జరుగుతాయి అనే అభిప్రాయం అందరి మదిలో బలంగా నాటుకుపోయింది.
తాజాగా హైదరాబాద్ కి చెందిన ఒక ఆటో డ్రైవర్ బెట్టింగ్ లో భారీగా డబ్బులు పోగొట్టుకొని.. సిరాజ్ తో స్పాట్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నించిన సంగతి వెలుగులోకి వచ్చింది. భారత, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ అతను సిరాజ్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇటీవలే సిరాజ్ ACU కి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచుల తీరు గమనిస్తే స్పాట్ ఫిక్సింగ్ ఏమైనా జరుగుతుందా అనే అనుమానాలను సగటు క్రికెట్ అభిమాని వెల్లిబుచ్చుతున్నాడు. అలాగని ఇవి నిజం అని నమ్మలేం.. అలాగే అపోహ అని కొట్టి పారేయలేం.
దాదాపు రెండు వారల క్రితం కేకేఆర్- గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో రింకూ సింగ్ చివరి 5 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో 5 సిక్సులు కొట్టడంతో అందరూ ఈ మ్యాచ్ ఫిక్స్ చేశారని అనుకున్నారు. కానీ మనం ఒకసారి సరిగ్గా పరిశీలిస్తే ఎంత ఫిక్సింగ్ చేసినా వరుసగా 5 సిక్సులు కొట్టడం అసాధ్యం. ఇక ఇటీవలే రాజస్థాన్- గుజరాత్ మ్యాచులో కూడా గుజరాత్ విజయం నల్లేరు మీద నడకే అనుంటున్న తరుణంలో రాజస్థాన్ అనూహ్యంగా గుజరాత్ జట్టుకి షాకిచ్చింది. ఇదిలా ఉండగా మొన్న 155 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ సునాయాసంగా కొట్టేస్తుంది అనుకున్నారు. కానీ, 10 పరుగుల తేడాతో ఓడిపోయింది.
గుజరాత్ టీమ్ తో పోలిస్తే లక్నో బౌలింగ్ కాస్త బలహీనంగానే ఉన్న మాట నిజం. పటిష్టమైన గుజరాత్ బౌలింగ్ మీద రాజస్థాన్ ఓడిపోయే మ్యాచులో గెలిస్తే.. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన రాజస్థాన్ లక్నో మీద ఓ మాదిరి స్కోర్ కూడా కొట్టలేక చతికిలపడింది. అంతే కాదు హోమ్ గ్రౌండ్ లో మ్యాచులు గెలవలేకపోవడం కూడా అనుమానాలని బలపరుస్తున్న అంశం. అయితే ఫిక్సింగ్ చేశారని ఎలాంటి ఆరోపణలు లేవు. కానీ మ్యాచ్ జరుగుతున్న తీరుని గమనిస్తే ఫిక్సింగ్ లాగ అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజం అనేది డిసైడ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఆధారాలు లేనప్పుడు అవి కేవలం అభిప్రాయాలు, ఆరోపణలు, అనుమానాలు మాత్రమే అవుతాయి. ఐపీఎల్ 2023 మ్యాచ్ ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.