ఐపీఎల్ పదహారో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి అంచె ముగియడం, కొన్ని మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో ప్లేఆఫ్స్‌కు ఏ జట్లు క్వాలిఫై అవుతాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఒక్కో జట్టు దాదాపుగా తొమ్మిది, పది మ్యాచులు ఆడేశాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్తూ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తున్నాయి. ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు లేకపోవడంతో ఆడే ప్రతి మ్యాచ్ అన్ని జట్లకు కీలకంగా మారింది. పాయింట్ల టేబుల్లో జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. టేబుల్లో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో ఆ లిస్టులో చోటు దక్కాలంటే విజయాలతో పాటు నెట్ రన్‌రేట్ కూడా కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి టీమ్స్ ఆటతీరును బట్టి ఎవరు గెలుస్తారో ముందే చెప్పేశారు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.
ఈసారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టే గెలుచుకుంటుందని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన తొలి ఏడాదే టైటాన్స్ విజేతగా నిలిచింది. ఆ టీమ్‌లో ఉన్న సమతూకం, గెలుపు కోసం సమష్టిగా రాణిస్తుండటం చూస్తుంటే.. ఈసారి కూడా గుజరాత్ టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోందని రవిశాస్త్రి ఒక స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ విశ్లేషించారు. ఆ జట్టులో స్థిరత్వం ఉందని, ఏడెనిమిది మంది ప్లేయర్లు నిలకడగా రాణిస్తున్నారని రవిశాస్త్రి వివరించారు. గుజరాత్ ఆటగాళ్లు ఒకరికొకరు అండగా ఉంటున్నారని.. ఇది మంచి విషయమని మెచ్చుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథి సంజూ శాంసన్ పైనా ఆయన ప్రశంసల జల్లులు కురిపించారు. రాయల్స్‌ను శాంసన్ నడిపిస్తున్న తీరు బాగుందన్నారు రవిశాస్త్రి.
“Looking at the current form and team standings, I believe that Gujarat will win the trophy,” Ravi Shastri said.#GujaratTitans #IPL2023https://t.co/IZ8ZntWNAa
— India Today Sports (@ITGDsports) May 5, 2023