RCB vs DC Prediction: ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఢిల్లీ.. తమ ఐదో మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడుతుంది. అలాగే మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయంతో ఉన్న ఢిల్లీను ఢీకొంటోంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవర్ని వరిస్తుందంటే.. ?
ఐపీఎల్ 2023 మంచి జోరుగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ దాదాపు చివరి బాల్ వరకు వెళ్తోంది. ఏకపక్ష విజయాల ఊసేలేదు. థ్రిల్లర్ మూవీలకు మించి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మరో బిగ్ ఫైట్ జరగనుంది. అయితే.. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తొలి విజయం కోసం వార్నర్ సేన ఎదురుచూస్తోంది. ఇక ఆర్సీబీ.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి మంచి ఆరంభం పొందినా.. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఢిల్లీపై ఎలాగైనా గెలిచి రెండో విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే.. మరి రెండు జట్లలో ఎవరికి విజయం సాధించే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు..
ఆర్సీబీ ప్రధాన బలం ఓపెనింగ్ జోడీ. విరాట్ కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటంతో ఆర్సీబీ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. వారికి తోడు విధ్వంసకర బ్యాటర్ మ్యాక్స్‌వెల్ చివరి మ్యాచ్‌తో ఫామ్‌లోకి రావడంతో ఆర్సీబీ వేరే లెవెల్ టీమ్‌గా కనిపిస్తోంది. ఈ ‘కేజీఎఫ్’(కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) జోడీలో ఏ ఇద్దరూ రాణించినా.. ఆర్సీబీ స్కోర్ పరుగులు పెట్టడం ఖాయం. అయితే.. వీరితో పాటు ఇతర బ్యాటర్లు సైతం రాణించాల్సిన అవసరం ఉంది. వనిందు హసరంగా చేరికతో ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్ సైతం బలపడినట్లే.. పేస్ ఎటాక్‌లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పైగా హోం గ్రౌండ్‌లో ఆడుతుండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం.
ఢిల్లీ క్యాపిటల్స్..
ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. ప్రస్తుతం సీజన్‌లో ఇప్పటి వరకు అత్యంత ఫెల్యూర్ టీమ్ ఢిల్లీనే. కెప్టెన్ వార్నర్ తప్ప మిగతా బ్యాటర్లు రాణించడం లేదు. వార్నర్‌తో పాటు అక్షర్ పటేల్ ఒక్కడే ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. ఇక బౌలింగ్‌లోనూ ఢిల్లీ అంత పటిష్టంగా ఏం లేదు.. అన్రిచ్ నోర్జే మినహా.. ఎవరూ పెద్దగా ప్రభావం చూపడం లేదు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ సైతం రాణించకపోవడంతో ఢిల్లీ బౌలింగ్ బలహీనంగా మారింది.
తుది జట్ల అంచనా..
RCB: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లే, హర్షల్‌పటేల్, కరణ్ శర్మ, సిరాజ్.
DC: వార్నర్, పృథ్వీషా, మనీష్ పాండే, మిచెల్ మార్ష్, రిలీ రొసోవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, అభిషేక్ పొరెల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ముఖేష్ కుమార్.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.