CSK vs LSG Prediction: ఐపీఎల్ 2023లో సోమవారం లక్నోతో చెన్నై తమ సొంత మైదానంలో తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2023లో అన్ని జట్లు తలో మ్యాచ్ ఆడేశాయి. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ రెండో మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైన ధోని సేన, తొలి గెలుపు కోసం బరిలోకి దిగుతుంటే.. పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ రెండో గెలుపును ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. మరి ఈ పోటీలో విజయం ఎవరు సాధిస్తారు? ఎవరి బలం ఎలా ఉంది, అలాగే బలహీనతలు ఏంటో ఇప్పుడు పరిశీలించి.. విజయావకాశాలు ఎవరికి మెరుగ్గా ఉన్నాయో చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్..
తొలి మ్యాచ్‌లో ఓడినా కాని చెన్నై సూపర్ కింగ్స్ చాలా బలమైన జట్టు. పైగా ధోని కెప్టెన్‌గా ఉండటం వారి అదనపు బలం. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మరో ఓపెనర్ కాన్వె సైతం ఫామ్‌లోకి వస్తే.. చెన్నైను అడ్డుకోవడం అంత ఈజీ కాదు. ఇక బౌలింగ్ కూడా బలంగా ఉంది. కానీ.. తొలి మ్యాచ్‌లో కాన్వె, స్టోక్స్, రాయుడు విఫలం అవ్వడం వారి బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. అలాగే బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ దారుణంగా విఫలం అవ్వడం సైతం చెన్నై ఓటమికి కారణమైంది. కానీ, ఈ మ్యాచ్‌లో చెన్నై ఆ తప్పులు చేయకుండా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగడం ఖాయం. చెన్నై బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతుల్యంగానే కనిపిస్తున్నా.. బ్యాటింగే వారి ప్రధాన బలం. బౌలింగ్ ఇంకాస్త మెరుగైతే.. చెన్నై హాట్ ఫేవరేట్‌గా ఉంటుంది. పైగా మ్యాచ్ వారి హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో జరుగుతుండటం చెన్నైకు కలిసొచ్చే అంశం.
లక్నో సూపర్ జెయింట్స్..
తొలి మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. కెప్టెన్ రాహుల్ విఫలమైనప్పటికీ.. మరో ఓపెనర్ మేయర్స్ 73 పరుగులతో అదరగొట్టాడు. అలాగే నికోసల్ పూరన్, ఆయూష్ బదోని కూడా ఫామ్‌లో ఉండటం లక్నోకు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లోనే లక్నో కాస్త వీక్‌గా కనిపిస్తోంది. మేయర్స్, ఆవేష్ ఖాన్ , మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ లాంటి వాళ్లు కనిపిస్తున్నా.. చెన్నై బ్యాటర్లు చెలరేగితే తట్టుకోవడం కష్టం. కానీ, తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆత్మవిశ్వాసం లక్నోకు బలంగా మారనుంది. పైగా రాహుల్ ఫామ్‌లోకి వస్తే.. లక్నో తొలి మ్యాచ్ కంటే మించి భారీ స్కోర్‌చేసే అవకాశం ఉంది.
తుది జట్లు(అంచనా)
సీఎస్‌కే: కాన్వె, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, రాయుడు, ధోని, జడేజా, శివమ్ దూబే, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, హంగార్గేకర్.
లక్నో: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, స్టోయినీస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయూష్ బదోని, మార్క్ వుడ్, ఉనద్కట్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్.
ప్రెడిక్షన్: బలం, బలహీనతల విషయంలో ఇరు జట్లు సమంగా కనిపిస్తున్నా.. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండటం, అక్కడ సీఎస్‌కే మంచి విన్నింగ్స్ రికార్డ్ ఉండటంతో ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.