మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ పిల్లలిద్దరూ ఎవరా..? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆ పిల్లలు భారత మాజీ లెజండరీ క్రికెటర్ తనయులు. అందులో ఒకరు.. క్రికెటర్ కూడాను. ఎవరో గుర్తు పట్టగలరు.
శనివారం అరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు(ఆర్‌సీబీ) ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ సేన.. డుప్లెసిస్ ఆద్వర్యంలోని బెంగుళూరు జట్టును 7 వికెట్ల తేడాతో మట్టి కురిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 181 పరుగులు చేయగా, 20 బంతులు మిగిలివుండగానే ఢిల్లీ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. సిరాజ్ స్లెడ్జింగ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ (87; 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులు) ఒంటిచేత్తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు.
ఇదిలావుంటే ఈ మ్యాచ్ చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. కోహ్లీ సొంత గడ్డకు విచ్చేయడమే అందుకు ప్రధాన కారణం. భారత మాజీ సారథి, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ స్వస్థలం ఢిల్లీ అన్న సంగతి అందరికి విదితమే. ఈ క్రమంలోనే కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు రెండ్రోజుల క్రితం తన సొంత గడ్డకు విచ్చేశాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో హాఫ్ సెంచరీ(55)తో రాణించాడు. ఆర్‌సీబీ మ్యాచ్ ఓడినప్పటికీ, కోహ్లీ సొంతగడ్డపై రాణించడం అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్.. కోహ్లీని కలిసి ఫొటోలు దిగారు. ఆర్యవీర్ ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Virender Sehwag’s sons with Virat Kohli.
What a beautiful picture! pic.twitter.com/RPjWBcRh0b
— CricketMAN2 (@ImTanujSingh) May 7, 2023
కాగా, సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ తండ్రిలాగే క్రికెటర్ కావాలనుకుంటున్నాడు. ఇప్పటికే అతడు విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్యవీర్.. తండ్రిలాగానే రైట్ హ్యాండ్ బ్యాటర్. ఇదిలావుంటే ఇక కష్టమే అనుకుంటున్న స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో విజృంభిస్తోంది. తొలుత వరుసగా 5 మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ, తదుపరి 5 మ్యాచుల్లో నాలుగింట విజయం సాధించింది. మరోవైపు.. ఆర్‌సీబీ ప్రయాణం ఎప్పటిలానే పడుతూ లేస్తూ సాగుతోంది. 10 మ్యాచుల్లో 5 విజయాలు, 5 అపజయాలతో అదో స్థానంలో కొనసాగుతోంది.