ఐపీఎల్ పదహారో సీజన్లో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణీ కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో జట్టు సారథి డేవిడ్ వార్నర్ సంతోషంలో మునిగిపోయాడు.
ఐపీఎల్లో ఆడటం వల్ల ఎందరో అనామక ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. ఇందులో రాణించిన వారు ఏకంగా జాతీయ జట్లకు ఎంపికవ్వడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే అనామక ప్లేయర్లు వెలుగులోకి రావడమే కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్లో మోస్తరు పేరు, క్రేజ్ ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా స్టార్లుగా మారారు. ఆ లిస్టులో డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఎంత అద్భుతంగా రాణించినప్పటికీ వార్నర్‌కు నిజమైన క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఐపీఎల్ ద్వారానే వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016 టైటిల్ గెలవడంలో వార్నర్‌ది కీలక పాత్ర. సన్‌రైజర్స్‌ను వార్నర్ అన్నీ తానై ముందుండి నడిపాడు. దీంతో అతడ్ని తెలుగువాళ్లు అక్కున చేర్చుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా యాక్టివ్‌గా ఉండే వార్నర్.. అభిమానులకు మరింత చేరువయ్యేందుకు పాపులర్ తెలుగు సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు చేస్తూ వీడియోలను షేర్ చేసేవాడు. అలా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురం’లోని ‘బుట్ట బొమ్మ’ పాటకు స్టెప్పులు వేస్తూ రీల్ చేశాడు. ఇది అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. అప్పటి నుంచి బన్నీని ఫాలో అవుతున్నాడు వార్నర్. ‘పుష్ప’ చిత్రం సక్సెస్ అయినప్పుడు అందులోని పాటలకు కూడా స్టెప్పులు వేశాడు. ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ గెలిచినప్పుడు.. ‘తగ్గేదేలే’ అంటూ గ్రౌండ్లో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. సన్ రైజర్స్‌కు బైబై చెప్పేసిన డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఈ టీమ్‌కు అతడు సారథి కావడం గమనార్హం.
ఈ సీజన్ ఐపీఎల్లో ఢిల్లీ జట్టు అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోతోంది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన ప్రతిసారి ఆ జట్టుకు ఓటమి ఎదురవుతోంది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. అయితే ఎట్టకేలకు ఆరో మ్యాచ్‌లో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి తొలి విక్టరీ కొట్టింది. దీంతో సంతోషంలో మునిగిపోయిన వార్నర్.. ‘పుష్ప-2’ మూవీలో అల్లు అర్జున్ గెటప్‌లో షాక్ ఇచ్చాడు. అమ్మవారి గెటప్‌లో బన్నీ స్థానంలో తాను ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు డేవిడ్ భాయ్. ఈ ఫొటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఢిల్లీ అలా బోణీ కొట్టిందో లేదో వార్నర్ మొదలుపెట్టేశాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప-2’లో వార్నర్ కోసం బన్నీ ఒక చిన్న రోల్ అయినా సిద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.