IPL 2023: క్రికెటర్ల తలరాతను మార్చేసే లీగ్... ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్. అయితే.. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అంటున్నారు కొంతమంది క్రీడా నిపుణులు.. అది ఎలాగంటే..
ఐపీఎల్ 2023 సీజన్ క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదాన్ని అందిస్తోంది. ఒక దానికి మించి మరో మ్యాచ్ థ్రిల్లర్ మూవీలను తలపిస్తున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్ కూడా చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగుతోంది. దీంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మజాను ఆస్వాదిస్తున్నారు. ఐపీఎల్ అంటే ఆరేడు వారాల పాటు క్రికెట్ హంగామా, క్రికెటర్లపై కాసుల వర్షం, వ్యాపారస్థులకు కోట్ల కొద్ది ఆదాయం, బీసీసీఐకి బంగారు బాతు.. ఇలా చాలా వర్ణించుకోవచ్చు. అయితే.. ఐపీఎల్ అంటే పైపైకి కనిపించే మెరుపులతో పాటు ఆ మెరుపుల వెనుక చీకటి కోణాలు సైతం చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
2013లో ఐపీఎల్‌కు సంబంధించిన ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు డబ్బులు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజయ్ చండీలా, అంకిత్ చౌహాన్ బుకీల నుంచి డబ్బు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నిర్దారణ అయింది. శ్రీశాంత్ ఒక ఓవర్‌లో 14 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చేందుకు బాల్ తుడిచే టవల్‌ను ముందు పెట్టుకుని మరీ.. సిగ్నల్ ఇచ్చి ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. అయితే.. అప్పటికే టీమిండియాలో కీలక ప్లేయర్‌గా ఉన్న శ్రీశాంత్, భారత్ గెలిచిన టీ20, వన్డే ప్రపంచ జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. అలాంటి ప్లేయర్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటే ప్రపంచ మొత్తం నివ్వెరపోయింది. ఈ వివాదంలో ధోని పేరు కూడా వినిపించింది. అలాగే రాజస్థాన్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించారు. ఆ ముగ్గురు ఆటగాళ్లపై లైఫ్ టైమ్ బ్యాన్ వేసినా.. ఆ తర్వాత బ్యాన్‌ను తొలగించారు.
మరోసారి కేకేఆర్-పంజాబ్ మధ్య మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలోనూ గందరగోళం చోటు చేసుకుంది. అప్పటి కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ టాస్ కోసం కాయిన్ గాల్లోకి ఎగరేయగా.. పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న మురళీ విజయ్ హెడ్స్ అని చెప్పినట్లు కామెంటేటర్‌గా ఉన్న రవిశాస్త్రి చెప్పాడు. కానీ, మ్యాచ్ రిఫరీ టేయిల్స్ పడినట్లు చెప్పి.. మురళీ విజయే టాస్ గెలిచినట్లు ప్రకటించాడు. ఇది అప్పట్లో పెను దుమారమే రేపింది. ఈ సంఘటనతో మరోసారి ఐపీఎల్ అంతా ఫిక్సింగ్ మయం అంటూ క్రికెట్ అభిమానులు ఆరోపించారు.
ఇక ఐపీఎల్‌లో ఆటతో పాటు ఆటగాళ్లు ఎంజాయ్ చేయడానికి ఖాళీ సమయాన్ని సరదాగా గడిపేందుకు ఫ్రాంచైజీలు అన్ని ఏర్పాట్లు చేస్తుంటాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత.. హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో ఆటగాళ్లు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీల కల్చర్ కూడా ఆటగాళ్లకు అలవాటైంది. ఐపీఎల్‌లో ఆడుతున్న రాహుల్ శర్మ, సౌతాఫ్రికా ఆటగాడు వాన్ పార్నెల్ ఒక రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారు. వీరిద్దరూ ఆ పార్టీలో డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో వీరిపై బీసీసీఐ కొన్నేళ్ల పాటు నిషేధం విధించింది. ప్రస్తుతం పార్నెల్ ఆర్సీబీకి ఆడుతున్నాడు.
ఐపీఎల్‌లో బ్లాక్‌మనీ రాజ్యమేలుతుందనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. ఈ వాదనకు ఒకసారి పూణె వారియర్స్ ఇండియా జట్టు ఆటగాడు మోహినిష్ మిశ్రా ఒక స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పిన విషయాలు బలం చేకూర్చాయి. ఐపీఎల్‌లో పూణె తనని రూ.30 లక్షలకు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అదనంగా రూ.70 లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు. కానీ, ఆ 70 లక్షలకు ఎలాంటి లెక్కలు ఫ్రాంచైజ్ వెల్లడించలేదు. దీంతో.. దాదాపు అందరు ఆటగాళ్లకు ఇలానే బ్లాక్ మనీ ఇస్తారని అప్పుడు క్రికెట్ అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది.
ఐపీఎల్ మొదలైన సమయంలో బాగా పాపులర్ అయిన మరో విషయం ఛీర్ లీడర్స్. వీళ్లు తమ టీమ్‌కు మద్దతుగా ఆడిపాడుతూ ప్రేక్షకులకు వినోదం అందిస్తుంటారు. వీళ్లను ఆయా ఫ్రాంచైజీలే ఏర్పాటను చేస్తుంటారు. అయితే.. ఎక్కువగా విదేశీ ఛీర్ గల్సే కనిపించే వారు. వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఛీర్ గల్స్‌గా చేసిన వాళ్లు పలు సందర్భాల్లో వెల్లడించారు. తమను కనీసం మనుషుల్లా చూడరని, ప్రేక్షకులు సైతం తమతో అసభ్యంగా మాట్లాడాతరని, అసభ్యకరంగా సైగలు చేస్తూ ఇబ్బంది పెడుతుంటారని బాధపడుతుండేవారు. జీవనాధారం కోసం తాము ఇది చేస్తుంటే.. చాలా మంది నీచంగా చూసే వారని తెలిపారు.
నిజానికి ఐపీఎల్‌ను మన దేశంలోని యువ క్రికెటర్లను ప్రొత్సహించేందుకు, మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రారంభిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కానీ.. ఇది కేవలం క్యాష్ లీగ్ అని తర్వాత అందరికీ బోధ పడింది. ఒకరిద్దరూ ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినా.. ఐపీఎల్ ముఖ్య ఉద్దేశం మాత్రం డబ్బే అని క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతుంటారు. దీంతో ఐపీఎల్ అంటే అంతా ఫ్రీప్లాన్డ్ గేమ్ అని, అంతా ఫిక్సింగ్ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. దీనికి పైన చెప్పిన చాలా విషయాలు బలం చేకూర్చుతుండగా.. ఐపీఎల్ వెనుక పాకిస్థాన్ కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి. పంజాబ్ కింగ్స్ కో ఓవర్‌గా ఉన్న నెస్ వాడియా పాకిస్థాన్ జాతి పిత జిన్నా మనవడు. దీంతో ఐపీఎల్‌లో పాకిస్థాన్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇలా దేశంలో యువ క్రికెటర్లను ప్రొత్సహించేందుకు ప్రారంభమైన ఐపీఎల్ అనేక చీకటి విషయాలను దాచేసుకుంటూ.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ కొనసాగుతోంది. ప్రపంచ క్రికెట్ శాసించే స్థాయికి చేరింది. మరి ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
IPL Fixing Exposed: Shocking Revelations and Inside Scoop on the Dark Side of Cricket!https://t.co/vUxsa4QrWc pic.twitter.com/GPM04RxARc
— Chotu Jadadeli (@ChotuJadadeli) April 8, 2023