IPL 2023: ఐపీఎల్‌లో ప్రతి రోజు ఏదో ఒక రికార్డు బద్దలు అవుతూనే ఉంటుంది. తాజాగా లక్నోపై చెన్నై విజయం సాధించడంతో ఆర్సీబీ నెలకొల్పిన ఓ రికార్డు బద్దలైంది.
ఐపీఎల్ 2023లో సోమవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తర పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో ధోని సేన విజయం సాధించి.. పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 57, కావ్వె 47 పరుగులతో రాణించారు. శివమ్ దూబే సైతం 16 బంతుల్లో 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. మొయిన్ అలీ 19, బెన్ స్టోక్స్ 8 పరుగులతో నిరాశపర్చినా.. అంబటి రాయుడు మాత్రం 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివరి ఓవర్‌లో ఐదు బంతులు మిగిలి ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లోనే రెండు భారీ సిక్సలు బాదాడు. మూడు బంతికి కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి.. క్యాచ్ అవుట్ అయ్యాడు.
కేవలం 3 బంతుల్లోనే 12 పరుగులు చేసి.. చివరి ఓవర్‌కు కావాల్సిన మైలేజ్ ఇచ్చి వెళ్లాడు. ధోని బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. పైగా ధోని వచ్చి.. రెండు బంతుల్లో రెండు సిక్సులు బాదేయడంతో స్టేడియంలోని చెన్నై అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ధోని, ధోని.. అంటూ స్టేడియం దద్దరిల్లింది. ఇలా మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. లక్నో బౌలర్లో మార్క్ వుడ్ 3, రవి బిష్ణోయ్ 3, ఆవేష్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సైతం మంచి ఆరంభాన్ని అందుకుంది. భీకర ఫామ్‌లో ఉన్న లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేసి దుమ్మురేపాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం 20 పరుగులు చేసి.. మేయర్స్‌కు సపోర్ట్‌గా నిలిచాడు.
కానీ.. ఓపెనింగ్ జోడీ విడిపోయిన తర్వాత.. లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది. 79 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. 82 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినీస్ విఫలం అవ్వడంతో లక్నో తిరిగి కోలుకోలేదు. కానీ, చివరల్లో నికోలస్ పూరన్ 32, ఆయూష్ బదోని 23 పరుగులతో రాణించడంతో.. కాస్త పోరాడినా.. చివరికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి 12 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో లక్నోపై విజయంతో చెన్నై ఓ రికార్డును బద్దలు కొట్టింది. లక్నోపై అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జట్టుగా చెన్నై నిలిచింది. గతేడాది ఆర్సీబీ-లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్-రజత్ పటీదార్ 92 పరుగులు జోడించారు. తాజాగా చెన్నై ఓపెనర్లు రుతురాజ్-కాన్వె 110 పరుగులు జోడించి ఆ రికార్డును బద్దలు కొట్టారు.
Ruturaj Gaikwad and Devon Conway have 3 century partnerships in just 9 innings. pic.twitter.com/fbvlJzkLcm
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2023