Virat Kohli, Sourav Ganguly: నిజానికి చాలా మంది గంగూలీ అభిమానులు.. కోహ్లీలోనే దాదాను చూసుకుంటారు. అప్పట్లో దాదా కూడా ఇలానే ఉండేవాడు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ.. ఇప్పుడు అదే కోహ్లీ దాదాను అవమానిస్తుంటే మాత్రం చాలా బాధపడిపోతున్నారు.
ఐపీఎల్ వేదికగా కొత్త వివాదం రాజుకుంది. శనివారం ఆర్సీబీ-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఢిల్లీ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ విషయంలో కోహ్లీ ప్రవర్తనపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. డగౌట్‌లో కూర్చున్న గంగూలీని కోపంగా చూస్తూ ఫీల్డింగ్‌కి వెళ్లడం, మ్యాచ్ ముగిసిన తర్వాత గంగూలీకి షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ముఖం తిప్పుకోవడం.. పాంటింగ్ బలవంతంగా ఆపినా వెళ్లిపోవడంపై సగటు క్రికెట్ అభిమనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు గంగూలీపై కోహ్లీకి అంత కోపం ఎందుకో చాలా మందికి అర్థం కావడం లేదు. కెప్టెన్సీ భారంతో బ్యాటింగ్‌పై ఫోకస్ తగ్గుతుందని కోహ్లీనే టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడు. ఉంటే మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్, లేదా పరిమిత ఓవర్లకు ఒక కెప్టెన్, టెస్టులకు ఒక కెప్టెన్ ఉండాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎలాగో కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడని.. వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించి, టెస్టు కెప్టెన్‌గా కొనసాగించింది. టీ20, వన్డే బాధ్యతలను రోహిత్‌కు అప్పగించింది. కొన్ని రోజులకు కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో ఆ బాధ్యతలను సైతం రోహిత్‌కే అప్పగించారు. ఈ స్టోరీ మొత్తం అందరికీ తెలిసిందే.
అయితే.. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పిస్తున్నట్లు కనీస సమాచారం ఇవ్వకుండా తప్పించారని కోహ్లీ ఆరోపించాడు. ఈ విషయంపైనే దాదాపై విరాట్ కోహ్లీ కోపంగా ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు. కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పించిన సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్న మాట వాస్తవమే అయినా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు, టెస్టులకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలనే నిర్ణయం ఒక్క గంగూలీదేనా? బోర్డులో దాదా ఒక్కడే ఉన్నాడా? అనే విషయాలను గుర్తుంచుకోవాలి. కోహ్లీని కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తప్పించారని అప్పట్లో క్రికెట్ అభిమానులంతా కోహ్లీకే మద్దతుగా నిలిచారు. కానీ.. ఆ వ్యవహారంలో దాదా ఒక్కడినే విలన్‌గా చూడటం ఎంత వరకు కరెక్ట్. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని బోర్డు కోరినప్పటికీ కోహ్లీ వినలేదు. అతను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ, బోర్డు తీసుకోకూడదా? అసలు కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పుకోమని కానీ, బ్యాటింగ్ దెబ్బతింటుందని కానీ.. బోర్డు సభ్యులెవరైనా హెచ్చరించారా? లేదు. కోహ్లీనే తనకు తాను ఊహించుకుని.. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.
చెప్పినా వినకుండా టీ20 కెప్టెన్సీని కోహ్లీ వదిలేసుకోవడంతో తప్పని పరిస్థితుల్లో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇది జరిగి కూడా చాలా కాలం అయిపోయింది. దాదాపు అంతా మర్చిపోయారు. కెప్టెన్సీ లేకపోయినా టీమిండియాలో కోహ్లీ గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు లేదనే విషయం మైదానంలో అతను ప్రవర్తించే తీరును బట్టి తెలిసిపోతుంది. ఇలా అన్ని సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఐపీఎల్ వేదికగా దాదాను అవమానించాడు కోహ్లీ. పర్సనల్‌గా ఎంత కోపం ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా.. మర్యాద పూర్వకంగా కలవాల్సి వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించాలి కానీ, నిన్న మొన్న క్రికెట్‌లోకి వచ్చిన పిల్ల బచ్చాలా ప్రవర్తించకూడదు. నిజానికి కోహ్లీ అలానే చేశాడు.
మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మంచి ప్రదర్శన చేశాడు. తన టీమ్ కూడా విజయం సాధించింది. చివర్లో ఇరుజట్ల ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్న క్రమంలో గంగూలీతో షేక్ హ్యాండ్ చేయకుండా కోహ్లీ ముఖం తిప్పేసుకున్నాడు. పాంటింగ్ ఆపి.. ఏదో చెప్పే ప్రయ్నతం చేస్తున్నా.. కోహ్లీ తల అడ్డంగా ఊపాడు. ఈ లోపు గంగూలీ ముందుకు వచ్చేసి వేరే ఆటగాళ్లతో కరచాలనం చేశాడు. ఇక్కడే కోహ్లీ తన అమర్యాదను ప్రదర్శించాడు. కెప్టెన్సీ విషయంలో గంగూలీ చేసింది కొద్ది సేపు తప్పే అనుకున్నా కూడా.. ఒక మాజీ క్రికెటర్, భారత క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ అయిన గంగూలీని ఈ విధంగా అవమానించడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ స్థాయికి ఇలాంటి కుంచిస బుద్ధి ఉండటం సరికాదని హితవు పలుకుతున్నారు. కోహ్లీ చేసిన తప్పును కప్పి పుచ్చుతూ.. కొంతమంది కోహ్లీ అభిమానులు సైతం దాదాపై సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెడుతున్నారు. ఇది ముమ్మాటికీ తప్పే.
గంగూలీ ఒక లెజెండ్. భారత క్రికెట్ జట్టు తలరాతను మార్చిన కెప్టెన్. ఫిక్సింగ్ భూతం భారత క్రికెట్‌ను కుదిపేస్తున్న సమయంలో.. కెప్టెన్సీ అనే ముళ్ల కిరిటాన్ని ధరించాడు. జట్టులో ప్రక్షళాన చేసి.. ఒక కొత్త టీమిండియాను నిర్మించాడు. ఎంతో మంది టాలెంటెడ్ క్రికెటర్లను వెతికి పట్టుకుని జట్టులోకి తీసుకొచ్చి.. వారిని బ్యాక్ చేసి.. భారత్‌కు గొప్ప ఆటగాళ్లను అందించాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఇండియన్ క్రికెట్‌కు ఎన్నో చేసిన గంగూలీ.. వరల్డ్ కప్ గెలవకపోవచ్చు కానీ.. అంతకంటే ఎక్కువే చేశాడు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును ఒకసారి పరిశీలిస్తే.. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోని, హర్భజన్ సింగ్ ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు.. అయితే వీళ్లందరిని టీమిండియాలోకి తీసుకొచ్చి వారిని బ్యాక్ చేసింది దాదానే. ధోని సారథ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. కానీ, ఆ జట్టును నిర్మించింది మాత్రం దాదానే. ఆయన పడ్డ కష్టం.. 2011లో భారత్‌కు వరల్డ్ కప్ అందించింది.
గ్రౌండ్‌లో కోహ్లీ చాలా అగ్రెసివ్‌గా ఉంటాడనే విషయం తెలిసిందే. అయితే.. కోహ్లీ అభిమానులకు తెలియంది ఏంటంటే.. కోహ్లీకి వందరెట్లు అగ్రెసివ్‌గా దాదా ఉండేవాడు. అసలు టీమిండియాకు భయం లేకుండా ఆడటం నేర్పిందే గంగూలీ. ఆస్ట్రేలియా లాంటి టీమ్‌ను ఆటతోనే కాదు మాటతోనూ ఓడించగల జట్టును తయారు చేశాడు. నిజానికి చాలా మంది గంగూలీ అభిమానులు.. కోహ్లీలోనే దాదాను చూసుకుంటారు. అప్పట్లో దాదా కూడా ఇలానే ఉండేవాడు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ.. ఇప్పుడు అదే కోహ్లీ దాదాను అవమానిస్తుంటే మాత్రం చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి దాదా గురించి ఇప్పుడున్న చాలా మంది యువ క్రికెట్ అభిమానులకు తెలియదు.
కెప్టెన్సీ విషయంలో కోహ్లీని అవమానించారని కోహ్లీ ఫ్యాన్స్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కానీ, గంగూలీకి అంతకంటే ఎక్కువే అవమానాలు జరిగాయి. ఫిక్సింగ్ ఆరోపణలతో ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉన్న టీమిండియాను 2003 వరల్డ్ కప్ ఆడే స్థాయికి తీసుకొచ్చిన గంగూలీని అవమానకరంగా కెప్టెన్సీ నుంచి ఆ తర్వాత జట్టు నుంచి కూడా తప్పించారు. అయినా కూడా గంగూలీ ఎవరి విషయంలోనూ అమర్యాదగా ప్రవర్తించలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా జట్టులోకి తిరిగొచ్చాడు. అదీ గంగూలీ అంటే. కోహ్లీ తన గురువుగా ధోనిని భావిస్తాడు. అలాంటి ధోని ఆరంభంలో వరుసగా విఫలం అవుతున్నా.. అతనికి మద్దతుగా నిలిచి, ఈ కుర్రాడిలో ఏదో ప్రత్యేకత ఉందని నమ్మి జట్టులో అవకాశాలు కల్పించాడు. ధోని టీమ్‌లో నిలబడ్డాడంటే అందుకు దాదానే కారణం. అందుకే.. గంగూలీ చివరి టెస్టు ఆడుతున్న సమయంలో గంగూలీని కొన్ని ఓవర్లు కెప్టెన్సీ చేయమని కోరి, ఒప్పించి దాదాపై తన ప్రేమ, గౌరవాన్ని ధోని చాటుకున్నాడు.
అయినా.. అగ్రెషన్, యాటిట్యూడ్, ఇగ్నోరెన్స్ విషయంలో ఇప్పుడు కోహ్లీ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ.. ఆ పదాలకు మరో పేరే దాదా. తన అగ్రెసివ్ కెప్టెన్సీతో భయమంటే ఏంటో తెలియని ఇండియన్ క్రికెట్ టీమ్‌ను తయారు చేశాడు. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో చొక్కా విప్పి గంగూలీ చేసిన సింహనాదం ముందు మరే క్రికెటర్ యాటిట్యూడ్ కూడా పనికిరాదు. అలాగే గర్వంతో భారత జట్టును అవమానించేలా మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవాను టాస్ కోసం ఎదురుచూసేలా చేసి అతని అహంకారాన్ని అణిచివేశాడు. వీటితో పోల్చుకుంటే.. కోహ్లీ యాటిట్యూడ్ ఎంత. గంగూలీ అగ్రెసివ్‌గా ఉన్నా, యాటిట్యూడ్ చూపించినా జట్టు కోసం, దేశం కోసం చేశాడు కానీ.. తన సొంత కోపతాపాల కోసం చూపించలేదు. అందుకే అతన్ని ఇండియన్ క్రికెట్‌కు ‘దాదా’ అంటారు.
ఇలాంటి చాలా విషయాలు ఇప్పటి పిల్లబచ్చా క్రికెట్ అభిమానులకు తెలియకపోచ్చు. కానీ.. కోహ్లీ గంగూలీని అవమానించాడంటే.. అది తనను తానే అవమానించుకున్నట్లు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్‌కు గంగూలీ తర్వాత అలాంటి కెప్టెన్ దొరికాడని కోహ్లీని చూసి చాలా మంది అనుకున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో సచిన్ తర్వాత అంతటోడంటూ కీర్తిప్రతిష్టతలు పొందుతున్న కోహ్లీ.. ఇలా ఓ యువ క్రికెటర్‌లా ప్రవర్తించడం సరికాదు. 33 బంతుల్లో 50 పరుగులు చేసి అంతలా సెలబ్రేట్ చేసుకోవడం కోహ్లీ స్థాయికి తగిందేనా? అనేది ఒక సారి కోహ్లీ అభిమానులు ఆలోచించుకోవాలి. 74 అంతర్జాతీయ సెంచరీలు ఉన్న గొప్ప క్రికెటర్.. ఇలా 50 రన్స్ చేసి అంతలా ఓవర్ ఎగ్జైట్ అవ్వడం ఏంటో? అర్థం కానీ ప్రశ్న. కేవలం గంగూలీపై కోపంతో కోహ్లీ అలా చేసుంటే.. అది అర్థం లేని పని. మరోసారి చెబుతుంది ఒక్కటే.. కోహ్లీ గంగూలీని అవమానిస్తే.. అది తనకు తాను చేసుకునే అవమానం.
This is the moment when Virat Kohli stares at Sourav Ganguly during yesterday’s game 🥶pic.twitter.com/2w8e3hngm1
— Sexy Cricket Shots (@sexycricketshot) April 16, 2023
Saurav Ganguly ignored Virat Kohli and Walk off where you can see Kohli turned back to see Dada
Once again Dada showed Virat Kohli his place 👏 pic.twitter.com/AphU0U3IMO
— R e t i r e d (@Sense_detected_) April 15, 2023