రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ చాహల్, ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా నిలిచాడు. ఇంతకీ చాహల్ సాధించిన ఆ రికార్డు ఏంటి?
ఐపీఎల్ పేరు చెప్పగానే అందరూ బ్యాటర్ల గురించి.. వాళ్లు కొట్టే ఫోర్లు, సిక్సులు గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇంతలా
పరుగుల వరద పారే ఈ టోర్నీలో బౌలర్లు కూడా అదే స్థాయిలో చెలరేగుతూ ఉంటారు. ఎవరికీ సాధ్యం కానీ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటారు. కాకపోతే ఆ విషయం అంత పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆ ఘనత సాధించింది భారత బౌలర్ అయితే.. అప్పుడు దాని గురించి తెగ మాట్లాడుకుంటారు. అలా తాజా సీజన్ లో తొలి మ్యాచ్ ఆడిన చాహల్.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్-రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్.. ఎంత పెద్ద తప్పు చేసిందో కాసేపటికే అర్థమైంది. రాజస్థాన్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో.. 203 పరుగుల భారీ స్కోరు చేశారు. హైదరాబాద్ బౌలర్లు పూర్తిగా ఫెయిలయ్యారు. అనంతరం ఛేదనలో సన్ రైజర్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో 20 ఓవర్లలో 131 రన్స్ మాత్రమే కొట్టగలిగింది. మ్యాచ్ ఓడిపోయింది. అయితే ఈ పోరులో 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన చాహల్.. అదరగొట్టేశాడు.
13 కోట్లు పెట్టి హైదరాబాద్ కొనుగోలు చేసిన హ్యారీబ్రూక్ ని చాహల్ ఔట్ చేశాడు. తద్వారా టీ20ల్లో 300 వికెట్ల మార్క్ ని అందుకున్న తొలి భారత బౌలర్ గా నిలిచాడు. ఇతడి తర్వాత అశ్విన్ (288) ఉన్నాడు. మొత్తంగా చూసుకుంటే చాహల్ 15వ స్థానానికి చేరుకున్నాడు. ఈ ఫార్మాట్ లో ఎక్కువ వికెట్లు తీసిన వారిలో డ్వేన్ బ్రావో (558) టాప్ లో ఉన్నాడు. ఈ లిస్టులో రషీద్ ఖాన్ (530), సునీల్ నరైన్ (479), ఇమ్రాన్ తాహిర్ (469), షకీబ్ అల్ హసన్ (415).. టాప్-5లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ లో 122 మ్యాచుల్లో 170 వికెట్లతో ఉన్న చాహల్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే మలింగ రికార్డును సమం చేశాడు. ఈ టోర్నీలోనూ బ్రావోనే 183 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. గతేడాది 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్ లో అదే ఫామ్ కొనసాగిస్తే బ్రావోని దాటేయడం అంత పెద్ద కష్టమేం కాదు! మరి చాహల్ రికార్డుపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
The first Indian to 300 T20 wickets. 👏💗 pic.twitter.com/Q8PDmhHR4V
— Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023