భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ ఈ ఏడాది ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ తనదైన బౌలింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు.
జెంటిల్మన్ గేమ్ క్రికెట్లో భారత్ ఎంతో సాధించింది. వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెల్చుకుంది. టెస్టుల్లోనూ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టెస్టు ఛాంపియన్ షిప్ నెగ్గడం ఒక్కటే బాకీ ఉంది. సొంతగడ్డపై పులులు అనే పేరున్న టీమిండియా ప్లేయర్లు.. విదేశాల్లో మాత్రం సరిగ్గా ప్రదర్శన చేయరనే చెడ్డపేరు ఉండేది. కానీ గత కొన్నేళ్లలో అదీ మారింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లను వాళ్ల సొంతగడ్డ పైనే చిత్తుగా ఓడించింది టీమిండియా. ఇన్ని ఉన్నా భారత జట్టు క్రికెట్లో మరింత ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని కోల్పోతోంది. దీనికి బౌలింగ్ బలహీనత ఒక కారణంగా చెప్పొచ్చు. అంతర్జాతీయ స్థాయి పేస్ బౌలర్ల కొరత మనల్ని వేధిస్తోంది.
క్రికెట్లో భారత్ ఎప్పుడూ బ్యాట్స్మెన్ల కర్మాగారంలాగే పిలువబడింది. మన జట్టు బ్యాటర్లు అంటే ఏ టీమ్ బౌలర్లు అయినా భయపడాల్సిందే అనేలా ఆడతారు. కానీ బౌలింగ్‌లో అలా కాదు. స్పిన్‌లో దిగ్గజ బౌలర్లను అందించిన టీమిండియా.. ఫాస్ట్ బౌలింగ్‌లో మాత్రం కొందరినే తయారు చేయగలిగింది. అందులోనూ నాణ్యమైన లెఫ్టార్మ్ పేసర్‌గా జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా లాంటి ఇద్దరు, ముగ్గురినే అందించింది. ఇందులో జహీర్ ఒక్కడే అన్ని ఫార్మాట్లలో భారత్‌కు ఎక్కువ కాలం పాటు సేవలు అందించాడు. నెహ్రా ఎక్కువగా లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లోనే టీమిండియాకు ఆడుతూ వచ్చాడు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత భారత్‌కు సరైన లెఫ్టార్మ్ పేసర్ లేకుండా పోయాడు.
కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, నిలకడైన వేగం, బాల్‌ను ఇరు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరిగిత్తెంచే సత్తా ఉన్న ఎడమచేతి వాటం బౌలర్ కోసం టీమిండియా ఎదురు చూస్తోంది. అర్ష్‌దీప్ సింగ్ రూపంలో భారత్‌కు ఇప్పుడో ఆశాకిరణం కనిపిస్తోంది. తనకు ఇచ్చిన అవకాశాలను అర్ష్‌దీప్ సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు టీమిండియాకు లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్‌లో మరో ఆశాకిరణం కనిపిస్తున్నాడు. అతడే దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్. మంచి ఎత్తు, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తుండటంతో ఫ్యూచర్లో అతడు జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ పదహారో సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ టెండూల్కర్. గత రెండు మ్యాచుల్లో అతడు తానేంటో నిరూపించుకున్నాడు. సన్ రైజర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 2.5 ఓవర్లలో 18 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్లో ఒత్తిడితోనూ బాగా బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ ఎకానమీ బాగుంది. అయితే వేగాన్ని మరింత పెంచాలి. స్పీడ్, స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్ మరింతగా మెరుగుపడితే అర్జున్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఇకపోతే, అర్జున్ టెండూల్కర్ కోసం ఐపీఎల్లో చాలా మందికి ఛాన్సులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయినా అతడు చాలా కష్టపడి ఈస్థాయికి వచ్చాడు. టీమ్‌లోకి అతడు పనికొస్తాడనే నిర్ణయానికి వచ్చేదాకా అతడ్ని బెంచ్‌కే పరిమితం చేస్తూ రావడం గమనార్హం. మరి.. అర్జున్ టెండూల్కర్ భారత జట్టులోకి త్వరలో ఎంట్రీ ఇస్తాడని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.