క్రికెట్లో కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. కొందరు ప్లేయర్లు గ్రౌండ్లో వింత చేష్టలతో అందర్నీ నవ్విస్తుంటారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కేకేఆర్ బ్యాటర్ రస్సెల్ కూడా అలాగే చేసి నవ్వులు పూయించాడు. అసలేం జరిగిందంటే..!
ఐపీఎల్ పదహారో సీజన్లో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణీ కొట్టింది. గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్‌ను కోల్‌కతా బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. చాన్నాళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడుతున్న ఇషాంత్ శర్మతో పాటు కుల్దీప్ యాదవ్, ఎన్రిచ్ నోకియా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లతో కోల్‌కతా పతనాన్ని శాసించారు. ఓపెనర్ జేసన్ రాయ్ (39 బాల్స్‌లో 43), ఆండ్రీ రస్సెల్ (31 బాల్స్‌లో 38) తప్ప మిగతా వారు రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 127 రన్స్ మాత్రమే చేయగలిగింది.
సులువైన లక్ష్య ఛేదనను ఢిల్లీ దూకుడుగా మొదలుపెట్టింది. పవర్ ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు వికెట్ నష్టానికి 61 రన్స్. ఓపెనర్ వార్నర్ (57) దొరికిన బాల్‌ను దొరికనట్లు బౌండరీకి తరలించాడు. అయితే ఆ తర్వాత మాత్రం ఆ టీమ్ బ్యాటర్లు తడబడ్డారు. అయితే మనీష్ పాండే (21), అక్షర్ పటేల్ (19) రాణించడంతో ఢిల్లీ విజయతీరాలకు చేరుకుంది. ఇకపోతే, కోల్‌కతా ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వెంటవెంటనే రెండు వికెట్లు తీసిన కుల్దీప్.. హ్యాట్రిక్ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో తర్వాతి బాల్ కోసం స్లిప్‌లో ఇద్దర్ని, లెగ్ స్లిప్‌లో ఒక ఫీల్డర్‌ను ఉంచాడు. దీంతో అసహనానికి గురయ్యాడో ఏమో.. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న రస్సెల్ తన బ్యాటింగ్ స్టాన్స్‌ను మార్చాడు. మిడ్ వికెట్ బౌండరీ వైపు బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజ్ ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాల మీమ్స్ తయారు చేస్తున్నారు.
Kuldeep Yadav on a hat-trick.
Look at Andre Russell : pic.twitter.com/BqLlJEGxrD
— Rahul Sharma (@CricFnatic) April 20, 2023