టీమిండియా స్టార్ బ్యాటర్ అజింక్యా రహానె ఐపీఎల్ పదహారో సీజన్ తొలి అంచెలో అదరగొట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత మాత్రం అతడు నెమ్మదించాడు.
టెస్ట్ క్రికెట్లో భారత జట్టుకు దొరికిన ఒక ఆణిముత్యం అజింక్యా రహానె. మ్యాచ్ పరిస్థితులను బట్టి పిచ్‌పై కుదురుకుని రన్స్ చేస్తూ పోవడం రహానె స్టయిల్. భీకర ఫాస్ట్ బౌలర్లతో పాటు బాల్‌ను మెలికలు తిప్పే స్పిన్నర్లను కూడా అంతే సమర్థంగా ఎదుర్కోగల సత్తా అతడి సొంతం. టెస్టుల్లో టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో రహానె పాత్ర ఉంది. అందుకే అతడికి వైస్ కెప్టెన్‌గా కూడా ప్రమోషన్ లభించింది. కానీ దీన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. టెస్టులతో పాటు వన్డేల్లోనూ చోటు కోల్పోయాడు. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత రహానేలో కసి పెరిగింది. మరింతగా పట్టుదలతో సాధన చేశాడు. ఎలాగైనా కమ్‌బ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.
టీమిండియాలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న రహానేకు ఐపీఎల్ పదహారో సీజన్ ఆశాదీపంలా కనిపించింది. ఈ అవకాశాన్ని అతడు పోనివ్వలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన రహానె.. తొలి అంచెలో దుమ్మురేపాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో 20 బాల్స్‌లో హాఫ్ సెంచరీ బాదేశాడు. దీంతో అతడు కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఈ సీజన్లో సీఎస్కే ఆడిన తొలి ఐదు మ్యాచుల్లో రహానె స్ట్రయిక్ రేట్ 199.04తో రన్స్ వరద పారించాడు. ఫోర్లు, సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడి రహానె వెర్షన్ 2.Oగా కనిపించాడు. రహానె బ్యాటింగ్‌కు ఇంప్రెస్ అయిన బీసీసీఐ.. అతడికి సూపర్ ఛాన్స్ ఇచ్చింది. త్వరలో జరగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ఆడే భారత జట్టులోకి రహానేను ఎంపిక చేసింది. సుమారు 17 నెలల తర్వాత టీమిండియా తరఫున ఆడే ఛాన్స్‌ను దక్కించుకున్నాడు రహానె.
ఐపీఎల్-2023 తొలి అంచెలో అదరగొట్టడం, బీసీసీఐ నుంచి పిలుపు అందుకోవడం వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే కథ మారిపోయింది. సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాక ఎందుకో రహానె ఆట ఛేంజ్ అయింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టును ప్రకటించక ముందు 199.5 స్ట్రయిక్ రేట్‌తో 52.25 సగటుతో రన్స్ చేసిన అజింక్యా.. ఆ తర్వాత మూడు మ్యాచుల్లో 114 స్ట్రయిక్ రేట్‌తో మాత్రమే రన్స్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికవ్వడంతో రహానె రిలాక్స్ అయిపోయాడని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ వాపోతున్నారు. వచ్చాడు, బాదాడు, మాయమయ్యాడని.. రహానె 2.O ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. అయితే రహానె అభిమానులు మాత్రం అతడు కావాలనే రిస్క్ తీసుకోవడం లేదని అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఫిట్‌గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వాదిస్తున్నారు. మరి.. రహానె హఠాత్తుగా నెమ్మదించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.