ఐపీఎల్ 2022లో బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కోత్తా నైట్ రైడర్స్ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించినా.. కేకేఆర్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ జట్టు అంతలా పోరాట స్ఫూర్తిని కనబర్చింది. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమితో ఈ సీజన్‌లో కేకేఆర్ ప్రస్థానం ముగిసింది. ముంబై, చెన్నై తర్వాత ఇంటిదారి పట్టిన జట్టుగా కేకేఆర్ నిలిచింది. కాగా ఈ మ్యాచ్ తర్వాత కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్నోతో మ్యాచ్‌లో ఓడినందుకు తానేమి బాధపడటం లేదని తెలిపాడు. శ్రేయస్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నేను ఆడిన క్రికెట్‌లో ఇది బెస్ట్ గేమ్. మా జట్టు ఆటతీరు పట్ల సంతోషంగాఉంది. పట్టువదలని పోరాటతత్వం అద్భుతం. రింకూ సింగ్ ఈ రోజు హీరో అవుతాడని భావించా.. కానీ దురదృష్టవశాత్తు చిన్న తేడాతో మ్యాచ్‌ను కోల్పోయాం.
ఈ మ్యాచ్‌లో మేం ఇలా ఆడుతామని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే పిచ్ చాలా పొడిగా ఉంది. గడ్డి కొంచెం కూడా లేదు. దాంతో స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించా. లక్నో అద్భుతమైన ఆరంభాన్ని అందుకొని మా బౌలర్లపై విరుచుకుపడింది. మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇది మాకు చావో రేవోలాంటి పరిస్థితి కావడంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా మా బ్యాటర్లు కడవరకు పోరాడాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలనే కసితో ఆడారు. వీలైనంత మేరకు మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి లక్నోను ఒత్తిడికి గురిచేయాలనే ప్రణాళికతోనే ఆడాం. ఈ సీజన్ మాకు ఏ మాత్రం ఊహించని రీతిలో సాగింది. మేం అద్భుతంగా ఆరంభించినా.. తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడటం మా ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది.అయితే జట్టులో మేం ఎక్కువ మార్పులు చేయడం వల్లనే ఇలా జరిగిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆటగాళ్ల గాయాలు, పేలవ ఫామ్ కారణంగానే మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే రింకూ లాంటి సత్తా ఉన్న ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ సానుకూల దృక్పథమే ఉంది. ఎనాడు భయాందోళనకు గురైంది లేదు. మా కోచ్ మెక్‌కల్లమ్‌తో నాకు మంచి రిలేషన్ ఏర్పడింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతనితో మాట్లడవచ్చు. మెక్‌కల్లమ్ ఆటగాళ్లను ఎప్పుడు జడ్జ్ చేయడు. అందర్ని సమానంగా చూస్తాడు.’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్వింటన్ డికాక్(70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 నాటౌట్) భారీ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీశ్ రాణా(22 బంతుల్లో 9 ఫోర్లతో 42), సామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), రింకూ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40) ధాటిగా ఆడారు.
లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, మార్కస్ స్టోయినీస్ మూడేసి వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో లక్నో ప్లేఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధిస్తే.. కేకేఆర్ అధికారికంగా ఇంటిదారి పట్టింది. మరి ఈ సీజన్‌లో కోల్‌కత్తా ప్రదర్శన, ఫెల్యూయిర్‌పై, ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: కోల్‌కత్తా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం! లాస్ట్ బాల్ నరైన్ ఆడుంటే కథ వేరుండేది!