ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరా? అన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లే దొరికి.. మాయమైంది. మాయమవ్వడం ఏంటి? కెప్టెన్సీ వదులుకున్నాక కూడా ధోని కెప్టెన్ లానే వ్యవహరించడంతోనే జడేజా తప్పుకున్నాడు అన్నది అందరూ అనుకుంటున్నమాట. కాదు.. కాదు.. కెప్టెన్సీ భారాన్ని మోయలేక తప్పుకున్నాడన్నది మరికొందరి వాదన. ఈ విషయంపై సీఎస్కే మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ స్పందించాడు.
ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా.. 10 మ్యాచులు కూడా ముగియకముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మరలా పగ్గాలు చేపట్టేందుకు ధోని అంగీకరించడం కూడా జరిగింది. ఈ విషయంపై సీఎస్కే మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ స్పందించాడు. “జడేజా, సీఎస్‌కే కెప్టెన్సీ తీసుకోబోతున్నాడని తెలిసినప్పుడు నేను షాక్ అయ్యా. ఎందుకంటే ఫీల్డ్‌లో ఎమ్మెస్ ధోనీ ఉంటే మిగిలిన ఆటగాళ్లపై అతని ప్రభావం ఓ లెవెల్‌లో ఉంటుంది. దాన్ని దాటి కెప్టెన్‌గా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. జడ్డూ విషయంలోనూ అదే జరిగింది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం చాలా బాధకరం. నిజానికి జడేజా చాలా గొప్ప క్రికెటర్.. సీఎస్‌కే లాంటి సక్సెస్‌ఫుల్ టీమ్‌ని నడిపించబోతున్నా అనే ఆలోచనే అతన్ని మరింత ఒత్తిడిలోకి నెట్టేసి ఉంటుంది”.
ఇది కూడా చదవండి: Virender Sehwag: వార్నర్ కు అందరితో గొడవలే.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్
“సీఎస్‌కే ఫ్రాంఛైజీ మొత్తం ఎమ్మెస్ ధోనీ చుట్టూ నిర్మించబడింది. అందుకే ఆ జట్టును వేరే ప్లేయర్ నడిపించడం చాలా కష్టం. ధోనీ జట్టులో ఉన్నంతకాలం అతనే కెప్టెన్‌గా కొనసాగాలి.. అతడు జట్టునుంచి తప్పుకున్నాకే ఎవరైనా. నిజానికి జడేజా ఈ పొజిషన్ తెచ్చుకోకుండా ఉండి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి నేను తప్పుకున్నప్పుడు చాలా భాధపడ్డా. ఆ బాధ ఎలా ఉంటుందో.. భరించిన వాళ్ళకే తెలుస్తుందని వాట్సన్ చెప్పుకొచ్చాడు. కానీ.. ఇది చేయాలన్నా.. చాలా ధైర్యం కావాలి.. జడేజా ఆ సాహసం చేసినందుకు మెచ్చుకోవాల్సిందే” అని వాట్సన్ తెలిపాడు.
వాస్తవానికి కెప్టెన్సీ భారాన్ని జడేజా మోయలేకపోయాడన్నది బహిరంగ రహస్యం. కెప్టెన్సీ భారంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో జడ్డూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతోపాటు ఏ ఒక్కరు సరిగా రాణించకపోవడం చెన్నై విజయాలను మరింత దెబ్బతీసింది. ఏదైతేనేం.. ధోనీ, రైనా తర్వాత చెన్నై కెప్టెన్సీ చేపట్టిన మూడో ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ధోనీ నాయకత్వంలో నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీఎస్కే.. రెండుసార్లు ఛాంపియన్స్‌లీగ్ టీ20ను గెలుచుకుంది.