విరాట్ కోహ్లీ.. రన్ మెషీన్ అనే బిరుదుకు వందశాతం న్యాయం చేసిన పేరు. ఇండియన్ క్రికెట్‌లో టన్నులు కొద్ది పరుగులు చేసిన స్టార్ క్రికెటర్. తన కెప్టెన్సీలో టీమిండియాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన లీడర్. ఇలాంటి ఆటగాడు ఐపీఎల్ 2022లో మాత్రం పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. నెట్స్‌లో గంటల కొద్ది శ్రమించినా అదృష్టం కలిసిరాలేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్ అయ్యాడు. అయినా కూడా తన పట్టువదల్లేదు.. ఇసుమంతైన నిరాశ చెందలేదు.. పైగా తన స్వచ్ఛమైన చిరునవ్వుతో తన బ్యాడ్‌లక్ చెంపపై ఛెళ్లున కొట్టాడు. సహనంతో తనపై తాను నమ్మకం ఉంచాడు.
గురువారం గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీకి చావోరేవో మ్యాచ్‌లో చెలరేగి గెలిపించి కింగులా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో కోహ్లీ ఫామ్ పుంజుకోవడంపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ.. ఈ సీజన్‌లోనే ఒకసారి రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్‌తో జరిగిన సంభాషణ గురించి ఆసక్తి కర విషయాలు వెల్లడించాడు. ‘రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం బట్లర్ నా వద్దకు వచ్చి.. నీతో ఒక విషయం ఆడగనా అన్నాడు. నేనే పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాను.. నువ్వు ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌వి నీకు నేనేమి చెప్పగలను’ అని కోహ్లీ బట్లర్ అన్న విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ఈ మాట తర్వాత ఇద్దరు నవ్వుకున్నారంటా. వినడానికి సాధారణంగా ఉన్నా.. ఈ మాట తర్వాత కోహ్లీ ఎంత నిష్కల్మశంగా ఉంటాడో అర్థం అవుతుంది.కోహ్లీ ఎంత గొప్ప ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి తన ఫెల్యూయిర్ గురించి.. తోటి ఆటగాడి వద్ద ఇంత సింపుల్‌గా మాట్లాడటం అంత తేలికైన విషయం కాదు. పైగా తన సమవుజ్జీ రాణింపును అంతే పెద్ద మనసుతో మెచ్చుకోవడం కూడా కోహ్లీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. తన వద్దకు వచ్చిన ఆటగాడితో తానో స్టార్ ప్లేయర్ అనే హోదాతో కోహ్లీ మాట్లాడి ఉండొచ్చు. కానీ.. కోహ్లీ అలాంటి అనవసరపు డాంబికాలకు పోలేదు. తాను బ్యాడ్ ఫామ్‌లో ఉన్న విషయాన్ని తానే స్వయంగా ఒప్పుకున్నాడు. సాధారణంగా ఏ ఆటగాడైన పరుగులు చేయలేకపోతు ఇబ్బంది పడుతుంటే.. తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. ఎక్కువగా సహనం కోల్పోతుంటారు. కానీ కోహ్లీ మాత్రం చాలా హుందాగా ప్రవర్తించాడు. బట్లర్‌తో చాలా సరదాగా సంభాషించాడు. కోహ్లీ ఎనర్జీకి బట్లర్ సైతం ఆశ్యర్యపోయి ఉంటాడు. అందుకే కోహ్లీ గొప్ప క్రికెటరే కాదు.. అంతకంటే గొప్ప స్ఫూర్తిదాయకుడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. తిట్టుకుంటున్న SRH, పంజాబ్ ఫ్యాన్స్!