ఐపీఎల్ 2022లో మంగళవారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా హోరాహోరీ పోరు జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. రాజస్థాన్ రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్2లో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చేలరేగి ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఊచకోత కోసి తమ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 భారీ సిక్సులతో 68 పరుగులు చేసి.. గుజరాత్ టైటాన్స్‌కు అద్భుత విజయం అందించాడు.
కానీ.. మ్యాచ్ అనంతంర రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారీ చెబుతూ ట్వీట్ చేశాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చి సంబురాల్లో మునిగి తేలాల్సిన మిల్లర్ ఇలా రాజస్థాన్‌కు ఎందుకు సారీ చెప్పాడు? సారీ చెప్పాల్సినంత తప్పు తనేం చేశాడు? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిజానికి మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో మిల్లర్ ఏ తప్పు చేయలేదు. కానీ.. తన మాజీ టీమ్‌పై ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి ఫైనల్‌కు వెళ్లకుండా అడ్డుకున్నందుకు మిల్లర్ ఎంతో హుందాగా సారీ చెప్పాడు. ఎందుకంటే 2020, 21 సీజన్లలో మిల్లర్ రాజస్థాన్ జట్టుకే ఆడాడు. 2014 నుంచి 2019 వరకు పంజాబ్ కింగ్స్ ఆడిన మిల్లర్‌ను.. 2020లో రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. తన కష్టకాలంలో తనపై రాజస్థాన్ టీమ్ నమ్మకం ఉంచిందనే ప్రేమతో మిల్లర్ ఇలా సారీ చెప్పి తన అభిమానం చాటుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 89 పరుగులు చేసి రాణించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, పాండ్యా, దయాళ్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌ను ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్‌లోనే ఫామ్‌లో ఉన్న సాహాను అవుట్ చేసి దెబ్బతీశాడు. ఆ తర్వాత మాథ్యూ వేడ్, శుభ్‌మన్ గిల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ.. సమన్వయ లోపంతో గిల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌లో 35 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కొద్ది సేపటికి వేడ్ 30 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి కెప్టెన్ హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ముగించారు. పాండ్యా 27 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు, మిల్లర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఈ సీజన్‌తోనే బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే ఫైనల్ చేరి అదరగొట్టింది.మరి ఈ మ్యాచ్‌లో మిల్లర్ ఆడిన ఇన్నింగ్స్.. రాజస్థాన్‌కు సారీ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్! రాజస్థాన్ కొంపముంచిన ప్రసిద్ధ్ కృష్ణ
Sorry #RoyalsFamily 🤷♂️
— David Miller (@DavidMillerSA12) May 24, 2022