ఐపీఎల్ 2022కి రంగం సిద్ధమైపోయింది. మెగా వేలం తర్వాత అన్ని జట్లు తమ ఆటగాళ్లను సమాయత్తం చేసుకునే పనిలో పడ్డాయి. గత సీజన్ టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రం దీపక్ చాహర్ రూపంలో భారీ షాక్ తగిలేలా ఉంది. దీపక్ చాహర్ వెస్టిండీస్ తో మూడో టీ20 మ్యాచ్ లో తొడ కండరాలు పట్టేసి మ్యాచ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో 1.5 ఓవర్లు మాత్రమే వేసి తప్పుకున్నాడు.
తాజాగా శ్రీలంక సిరీస్ కు కూడా చాహర్ దూరమయ్యాడు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఐపీఎల్ మీద కూడా పడేలా ఉందని తెలుస్తోంది. దీపక్ చాహర్ తొండ కండరాల సమస్య మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఐపీఎల్ పూర్తి సీజన్ కు అతను దూరం కానున్నట్లు సమాచారం. ఆ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని తెలుస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి అత్యధిక ధర పలికిన బౌలర్ దీపక్ చాహర్. అతడిని సీఎస్కే రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇదే వార్త నిజం అయితే సీఎస్కే అభిమానులకు భారీ షాక్ అనే చెప్పాలి.