కరోనా వైరస్ పరిస్థితులు పోయి ఇప్పుడిప్పుడే జనం సాధారణ పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ కొత్త వైరస్ మళ్లీ దేశంలో చెలరేగిపోతోంది. దేశ వ్యాప్తంగా కొన్ని వేల మంది వైరస్ బారిన పడుతూ ఉన్నారు.
కరోనా వైరస్.. ఈ పేరు ప్రపంచానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2019- 2021 మధ్య కాలంలో ప్రపంచాన్ని మొత్తం సర్వనాశనం చేసింది. దేశాలు మొత్తం లాక్‌డౌన్ విధించుకుని నాలుగు గోడల మధ్య నలిగిపోయాయి. అయినా మహమ్మారి ధాటికి కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఒక్క ఇండియాలోనే కొన్ని లక్షల మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. జనం ఉన్న ఉపాధి పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు సద్దుమణిగి ప్రజలు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఓ కొత్త వైరస్ దేశంలో కలకలం రేపుతోంది. ఆ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోకపోయినా.. ఆరోగ్య పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ వైరసే H3N2 ఇన్‌ఫ్లుయెన్జా. ఇంతకీ H3N2 ఇన్‌ఫ్లుయెన్జా అంటే ఏమిటి? ఆ వ్యాధి లక్షణాలు ఏంటి? నివారణ మార్గాలు వంటి తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
H3N2 ఇన్‌ఫ్లుయెన్జా వైరస్‌నే ‘హాంగ్‌కాంగ్ ఫ్లూ ’ అని కూడా అంటారు. ఇన్‌ఫ్లుయెన్జా వైరస్‌లలో ఇదో రకం. ఇది మానవ శ్వాస కోశ సంబంధిత అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. ఇది మనుషులకు సోకే అంటు వ్యాధి. ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. గతంలోనూ ఈ వైరస్ కారణంగా చాలా మంది అనారోగ్యం పాలయ్యారు.
మిగిలిన ఇన్‌ఫ్లుయెన్జా వైరస్‌లు మనిషికి సోకినపుడు ఉండే లక్షణాలే ఇందులో కూడా ఉంటాయి. జ్వరం 3 నుంచి 5 రోజుల పాటు ఉంటుంది. దగ్గు మూడు వారాల పాటు ఉంటుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం, గొంతు నొప్పి, వాంతులు కావటం, అలసట, ఒణుకు, విరేచనాలు H3N2 ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ లక్షణాలు. వీటిలో కొన్ని లక్షణాలు వారానికి పైగా ఉంటాయి.
H3N2 ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ ఓ అంటు వ్యాధి. మిగిలిన వైరస్‌లలాగే ఇది కూడా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లుగా ఈ వైరస్ కూడా వ్యాప్తి చెందుతుంది. H3N2 ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ వచ్చిన వారు ఇతరులతో మాట్లాడినపుడు, దగ్గు ద్వారా, తుమ్ముల ద్వారా ఈ వ్యాధి ఓ మనిషినుంచి మరో మనిషికి సోకుతుంది. అంతేకాదు! ఈ వైరస్‌తో ప్రభావితం అయిన ప్రాంతాలను తాకటం ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. H3N2 ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ కారణంగా గర్భిణిలు, పిల్లలు, ముసలి వాళ్లు, ఏవైనా వ్యాధులతో బాధపడుతున్నవారు జబ్బున పడే అవకాశం ఉంది.
H3N2 ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ లక్షణాలు గనుక మీలో ఉంటే.. జ్వరం తగ్గిపోయే వరకు ఓ 24 గంటల పాటు ఇంట్లోనే ఉండటం మంచిది. ఇలా చేయటం ద్వారా మీనుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశం తగ్గుతుంది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి. పానీయాలను ఎక్కువగా తీసుకోండి. వైరస్ సోకిన 48 గంటల్లోపే ఓవర్ ది కౌంటర్ మందులు తీసుకోవాలి. జలుబు, దగ్గుకు యాంటీబయాటిక్స్ తీసుకోవటం మానాలని ఐఎమ్‌ఏ తెలిపింది. కాబట్టి యాంటీబయాటిక్స్ జోలికి పోకపోవటం మంచిది. అప్పటికీ ఆరోగ్యం బాగుపడకపోతే కచ్చితంగా కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించటం ఉత్తమం.