ఈరోజుల్లో చాలామంది అధిక పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పొట్ట సమస్య వల్ల అనేక రకాల ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సరైన పద్ధతి లేకుండా పరిమితికి మించిన ఆహారం తినడం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం,కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువగా సేవించడం..ఇలాంటి వివిధ కారణాల వల్ల పొట్ట పెరిగే అవకాశం ఉంది. అసలు పొట్ట తగ్గడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
పొట్ట పెరగడానికి అతి ముఖ్యమైన కారణం శారీరక శ్రమ లేకపోవడం. ఈ మధ్య కాలంలో కంప్యూటర్ వర్క్ చేసేవాళ్లు చాలా ఎక్కువయ్యారు. ఎక్కువసేపు ఒకేచోట కదలకుండా కూర్చుని ఉండడం వల్ల అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల తగినంత వ్యాయాయం చేయడం,రెగ్యులర్ గా వాకింగ్ చేయడం చాలా అవసరం.అలాగే,యోగాలో కూడా పొట్ట తగ్గించుకోవడానికి ఆసనాలు ఉన్నాయి. వాటిని సాధన చేయడం ద్వారా కూడా పొట్టను తగ్గించుకోవచ్చు.
ఇక, పొట్ట తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తినడం తగ్గించాలి. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం.. అంటే పండ్లు,కూరగాయలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మకాయల్ని రసం పిండేసి, వాటి తొక్కలతో జ్యూస్ చేసుకుని,దానికి అల్లం ముక్కను కలుపుకుని తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల ఎసిడిటీ,అల్సర్ లాంటివి తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే,బూడిద గుమ్మడికాయ ఒక వంద గ్రాములు తీసుకుని, రెండు నిమ్మకాయ తొక్కలు తీసుకుని,వాటిని ముక్కలుగా కట్ చేసి,ఒక అల్లం ముక్క కలిపి, వీటన్నిటినీ కలిపి గ్రైండ్ చేసి, ఆ మిశ్రమానికి పలుచని మజ్జిగ కలపండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి, వడగట్టండి. దానికి మిరియాల పొడి కలిపి , ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ కు ముందు తాగండి. ఇవన్నీ చేస్తూనే వ్యాయామం తప్పకుండా చేయాలి. ఇలా నలభై రెండు రోజులు క్రమం తప్పకుండా చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం తీసుకునే ఆహారం ఏదైనా సరే సాయంత్రం ఆరు గంటల కంటే ముందే తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకునే ఆహారం ఏదైనా సరే శరీరానికి మంచిది కాదు. ఒకవేళ ఆరు గంటల లోపు తినడం కుదరకపోతే ఆ తర్వాత పలుచని పాలలో మిరియాలు కలుపుకుని తాగడం మంచిది. ఉదయం మనం తీసుకునే అల్పాహారంలో పచ్చి కూరగాయలు,పండ్లు ఉండేలా చూసుకోవాలి. మన శరీరంలో ఉన్న కొవ్వు కరగాలంటే మనకు కాల్షియం చాలా అవసరం. ఈ కాల్షియం ఎక్కువగా లభించే ఆహారాల్లో ముఖ్యమైనది ఎండు కొబ్బరి. కాబట్టి, దాని మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అదే విధంగా పాలలో, నువ్వుల్లో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది.
మనలో చాలామంది అలవాటుగా చేసే తప్పు ఏంటంటే రాత్రిపూట పండ్లు,ఐస్ క్రీమ్ లు తినడం. ఈ అలవాటు అసలు మంచిది కాదు. ఎందుకంటే,పగలంతా పనిచేసి అలసిపోయి,వేడెక్కి ఉన్న శరీరానికి ఒక్కసారిగా చల్లదనాన్ని అందించడం అంటే బాగా వేడెక్కిన కార్ ఇంజిన్ మీద ఒక్కసారిగా నీళ్లు చల్లడం లాంటిదే. ఇంజిన్ నుంచి ఆవిరి వచ్చినట్టుగానే మన శరీరం నుంచి ఒక్కసారిగా ఆవిరి మొదలౌతుంది. కాబట్టి ఈ అలవాటు మానుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా పొట్ట తగ్గించుకోవచ్చు.