ఊరికే ఆడవాళ్లు గొప్పవాళ్లు అయిపోలేదు. జీవితంలో వారికి ప్రతి ఒక్కటీ పరీక్షే. ఆ పరీక్షల్లో అతి ముఖ్యమైనది.. ఎంతో బాధించేది నెలసరి. అవును పిరియడ్స్ అనేవి ఆడవాళ్ల జీవితంలో ఒక అగ్ని పరీక్షలాంటిది. వారికి ప్రతినెలా ఈ నెలసరి బాధ తప్పదు. ఈ సమయంలో నడుం నొప్పి, కడుపు నొప్పి, పొత్తికడుపులో నొప్పి రావడం, కాళ్లు లాగడం, నిలబడలేకపోవడం, నీరసంగా ఉండటం, మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం.. ఇలా ఒకటేమిటీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఈ పిరియడ్స్, ఆసమయంలో వచ్చే నొప్పులు కారణంగా ఆడవాళ్లు అటు వ్యక్తిగత జీవితంలో, ఇటు ఉద్యోగం పరంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కార్యాలయాలు అయితే ప్రతినెలా పిరియడ్స్ మొదటిరోజు సెలవు తీసుకునేందుకు ఆడవాళ్లకు అవకాశం కల్పించారు.
అసలు ఈ పిరియడ్స్ ఎందుకు వస్తాయో చాలా మందికి తెలియదు. నిజానికి ఇది అందరితో చర్చించే సబ్జెక్ట్ కాదని భావిస్తూ ఉంటారు. నెలసరి సమయంలో ఆడవాళ్లకు రక్తస్రావం అవుతుందని అందరికీ తెలిసిందే. గర్భాశయం లోపలి గోడలను కప్పుతూ ఉండే ఎండోమెట్రియమ్ పొర మందంగా తయారై.. గర్భధారణకు సిద్ధంగా ఉంటుంది. ఆ పొరలోపల పిండానికి కావాల్సిన రక్తసరఫరా, పోషకాలను ఆ పొర అందిస్తుంది. ఎప్పుడైతే వీర్యకణం అండంతో కలిసి ఫలదీకరణ చెందుతుందో అప్పుడు.. మెట్రియమ్ అండాన్ని అంటిపెట్టుకుని ఎదిగేందుకు దోహదపడుతుంది. ఎప్పుడైతే వీర్యకణం అండంతో కలిసి ఫలదీకరణ చెందలేదో ఆ సమయంలో మెట్రియమ్ పొర రక్తస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. అలా రావడాన్నే మనం నెలసరి అంటాం. ఆలాంటి సమయాల్లో గర్భాశయం సంకోచించడం స్టార్ట్ అవుతుంది. గర్భాశయంలోని ధమనులు మూసుకుపోతాయి. అప్పుడు నొప్పిని కలిగించే రసాయనాలు విడుదల అవుతాయి.
అయితే ఈ నొప్పులతో వచ్చే బాధను మాటల్లో వర్ణించలేము. కొందరైతే ఆ నొప్పులు తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ ని వేసుకుంటూ ఉంటారు. అలా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడితే పిరియడ్ సైకిల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నొప్పులను అధిగమించేందుకు సింపుల్ చిట్కాలను వాడాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా నెట్టింట చాలానే చిట్కాలు ఉన్నాయి. అయితే జూహి కపూర్ అనే ఒక న్యూట్రీషియన్ సింపుల్ రెమిడీని సూచించారు. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు పిరియడ్ పెయిన్స్ వస్తే వాళ్ల అమ్మ ఈ మిశ్రమాన్ని ఇచ్చేవారని తెలిపారు. అప్పుడు కేవలం 10 నిమిషాల్లో తనకు ఆ నొప్పులు పోయేవని వెల్లడించారు. అందుకు పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక టీ స్పూన్ తేనెలో.. ఒక టీ స్పూన్ అల్లం జ్యూస్ కలిపి నెలసరి సమయంలో రోజుకి రెండుసార్లు తీసుకోవాలని సూచించారు. అలా చేస్తే నొప్పులు నిమిషాల్లో తగ్గుతాయన్నారు.