Thyroid Symptoms in Telugu: ప్రసుత్త కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న ఆరోగ్య సమస్య థైరాయిడ్. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంది. చాలా మంది థైరాయిడ్ అనగానే భయపడతారు. కానీ కొన్ని టెస్ట్‌లు, మార్పుల ద్వారా థైరాయిడ్ సమస్యను కట్టడి చేయవచ్చు అంటున్నారు వైద్యులు. ఆ వివరాలు..
థైరాయిడ్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న సమస్య. మన దేశంలో నూటికి 15-18 మందిలో థైరాయిడ్ సమస్య ఉంది. మిగతా జబ్బులతో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కాదు.. పైగా నివారించుకోగలం.. చికిత్స కూడా ఉంది. పైగా థైరాయిడ్ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం. థైరాయిడ్ బారిన పడ్డ మహిళల్లో అధిక బరువు, నెలసరి సమస్యలు, గర్భం దాల్చడంలో సమస్యలు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. నివారణ, చికిత్స మార్గాలు ఏంటి అనే పూర్తి వివరాలు..
థైరాయిడ్ అనేది సీతాకోక చిలుక ఆకారంలో కంఠం వద్ద ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్‌ని విడుదల చేయడం ద్వారా మన శరీంలో అనేక రకాల జీవ క్రియలను ప్రభావితం చేస్తుంది. ఇది ఎక్కువ పని చేసినా.. అసలు చేయకపోయినా సమస్యలే వస్తాయి. థైరాయిడ్ రెండు రకాలు. అవి 1. హైపోథైరాయిడిజం 2. హైపర్ థైరాయిడిజం.
థైరాయిడ్ సమస్య గుర్తించడానికి టీఎస్‌హెచ్, టీ3, టీ4 టెస్ట్‌లు చేస్తారు. టీఎస్‌హెచ్ 5 లోపు ఉంటే సమస్య లేదు. 10 వరకు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదని.. అంతకు మించితే.. వైద్యులు సూచించిన మేరకు మాత్రలు వాడాల్సి ఉంటుంది అంటున్నారు డాక్టర్లు.
తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్తత్తి కాకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఇందుకు ప్రధాన కారణం యాంటీ బాడీలు. ఇవి పెరిగితే.. థైరాయిడ్ కణాలను నశింపచేస్తాయి. ఇక శరీరంలో యాంటీ బాడీలు ఉన్నట్లు తెలిస్తే.. జీవితాంతం మాత్రలు వాడాల్సిందే అంటున్నారు వైద్యులు.
గోర్లు పెళుసుబారడం, మలబద్ధకం, చర్మం పొడిబారడం, థైరాయిడ్ గ్రంథి పెరిగినట్లు వాపు, కొలెస్ట్రాల్ పెరగడం, రుతుస్రావ సమస్యలు, చలి పడదు, లైంగిక కోరికలు తగ్గడం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, ముఖం మెత్తగా అవ్వడం, కండరాల బలహీనత, కొన్ని సందర్భాల్లో గుండె ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వీరు థైరాయిడ్ పరిమాణాన్ని పెంచడానికి మాత్రలు వాడతారు. ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒక్కసారి నటీఎస్‌హెచ్ ఒక్కటి చాలు. యాంటీ బాడీలు ఉంటే జీవితంతం టాబ్లెట్స్ వాడాలి. టీఎస్‌హెచ్ 0కి వస్తే ఆపేయాలి.
థైరాయిడ్ హార్మోన్ ఉత్తత్తి ఎక్కువ అయితే.. హైపర్ థైరాయిడిజం వస్తుంది.
గుండె దడ, ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, శరీరంలో వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దీనికి మాత్రలు వాడటం ముఖ్యం. అయినా తగ్గకపోతే.. రేడియోధార్మిక అయోడిన్ కలిగిన టాబ్లెట్ లేదా ద్రవాన్ని వినియోగిస్తారు. ఇది థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. రేడియో అయోడిన్‌ను నోటి ద్వారా తీసుకుంటారు. సర్జరీ అవసరం లేదు.
థైరాయిడ్ తగ్గాలి అంటే మాత్రలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. థైరాయిడ్ మాత్రలు పరిగడుపున వేసుకోవాలి. రెండు గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. కనీసం పాలు, టీ కూడా తాగకూడదు. అలా చేస్తే అవి పని చేయవు అంటున్నారు.
ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్) టెస్ట్ చేయించుకోవాలి. దీని వల్ల థైరాయిడ్ సమస్యను త్వరగానే గుర్తించవచ్చు.. నియంత్రించవచ్చు.
వైద్యులు కొందరిని జీవితాంతం థైరాయిడ్ మాత్రలు వాడమంటారు. ఇందుకు కారణం యాంటీ బాడీలు. ఇవి మన శరీరంలో ఉంటే థైరాయిడ్ హార్మోన్‌ను తయారు చేసే కణాలను నశింపచేస్తుంది. అందుకే యాంటీ బాడీలు ఉన్నట్లు తెలిస్తే.. జీవితాంతం థైరాయిడ్ మాత్రలు వాడాల్సి ఉంటుంది అంటున్నారు వైద్యులు. ఇందుకోసం యాంటీ బాడీ, యాంటీ టీపీఓ టెస్ట్ చేయించుకోవాలి. ఒక్కసారి చేయిస్తే సరిపోతుంది.
గర్భిణీలు థైరాయిడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. థైరాయిడ్ హార్మోన్ అనేది పిండం మెదడు ఎదుగుదలకి ఎంతో అవసరం. ప్రత్యేకించి మొదటి మూడు నెలల్లో, మాటర్నల్ థైరాక్సిన్ ఎంతో అవసరం. హైపోథైరాయిడిజం ఉన్న వారు ప్రెగ్నెన్సీ సమయం అంతా కూడా థైరాక్సిన్ ట్రీట్మెంట్‌ని కంటిన్యూ చేయాలి. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ హార్మోన్ అధికంగా అవసరం ఉంటుంది. కనుక థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఆధారంగా థైరాక్సిన్ డోస్ పెంచే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవగానే థైరాయిడ్ పేషెంట్స్ వారి డాక్టర్‌ని సంప్రదించి.. థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి.
గమనిక: ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే సరైన మార్గం.