ఈమధ్య కాలంలో మహిళల్లో ఎక్కువగా వినిపిస్తోన్న అనారోగ్య సమస్య పీసీఓడీ, పీసీఓఎస్. దీని బారిన పడితే మహిళల్లో గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది.. నివారణ మార్గాలు ఏంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వివరాలు..
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆహార పదార్దాలు అనేక కొత్త కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో.. మహిళలల్లో తరచుగా వినిపిస్తోన్న అనారోగ్య సమస్య పాలిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ), పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్). ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 శాతం మంది మహిళలు పీసీఓఎస్, పీసీఓడీ సమస్యతో బాధపడుతుండగా.. మన దేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారంటే.. దీని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య ఉన్న వారిలో పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా వంటి వివరాలు..
మహిళల్లో ఎండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్య వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా ఈ ఎండ్రోజన్ హార్మోన్ మగవారిలో ఉంటుంది. అయితే పీసీఓఎస్ బారిన పడ్డ మహిళల్లో ఈ ఎండ్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఇందుకు కారణం.. మహిళల శరీరంలో.. హార్మోన్ల అసమతుల్యత. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఫలితంగా ఇన్సులిన్ మోతాదు ఎక్కువై.. మహిళల్లో ఎండ్రోజన్ అధికంగా ఉత్పత్తి అయ్యి.. పీసీఓఎస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక పీసీఓఎస్ సమస్య ఉన్న వారి అండాశయాల్లో నీటి తిత్తులు ఏర్పడి అండాల విడుదలను అడ్డుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారిలో పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటున్నారు వైద్యులు.
కొంతమంది మహిళలల్లో.. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలసరి క్రమంగా రాదు. ఫలితంగా అండం విడుదల జరగదు. దీంతో.. అండాశంలో చిన్న చిన్న నీటి బుడగలు ఏర్పడతాయి. దీనినే పీసీఓడీ (పాలిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది అనే దాని గురించి పూర్తి స్థాయిలో ఖచ్చితమైన సమాధానం చెప్పలేము అంటున్నారు వైద్యులు. కానీ మన ఆహార అలవాట్లు, జన్యుపరమైన అంశాలతోపాటు హార్మోన్ల అసమతుల్యత వంటివి పీసీఓడీకి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు వైద్యులు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందిస్తున్నాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యం పరంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించండి.