మనం ప్రస్తుతం చలికాలం ముంగిట్లో ఉన్నాం. వేసవిలో మాదిరిగా ఉక్కపోతల, ఉబ్బరింత లాంటి బాధలేమీ లేకుండా… కంబళిలో వెచ్చగా ముడుచుకుని పడుకునే హాయిని అనుభవింపజేసేంత ఆహ్లాదం ఉంటుంది. ఇది ఒకవైపు మాత్రమే.. మరోవైపు ఈ సీజన్ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. పైగా ఇది వైరస్ లు మరింత బలపడేందుకు అనువైన కాలం కావడంతో కొత్త వైరస్ లు విజృంభించే అవకాశం ఉంది. వీటితో పాటు చలికాలంలో చేతులు పొడిబారిపోవడం, పాదాలు, మడమలు పగలడం మనకు తెలిసిందే. ఈ సమస్యల నుంచి పరిష్కారానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెప్పారు. వాటిని పాటిస్తే సరి. అవి ఏంటో ఓసారి చూద్దాం.
చలికాలం వచ్చిందంటే పాదాలు, మడమల పగుళ్ల కారణంగా చాలామంది బాధపడడం మనం గమనిస్తూనే ఉంటాం. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతుంది ‘పెడిక్యూర్’. ఇందులో భాగంగా పాదాల్ని కాసేపు పాలల్లో ఉంచాలి. తద్వారా పాలల్లోని లాక్టికామ్లం పాదాలు, మడమల గరుకుదనాన్ని పోగొట్టి వాటిని మృదువుగా మారుస్తుంది. ఆ తర్వాత బాదం నూనెతో మరికాసేపు పాదాలు, మడమల్ని మర్దన చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ పద్ధతి.. చలి వల్ల పొడి బారిపోయిన చర్మానికి తేమను, పోషణను అందించడానికి చక్కగా ఉపకరిస్తుంది. పెడిక్యూర్ ట్రీట్ మెంట్ వల్ల శరీరానికి వెచ్చదనం కూడా అందుతుంది.
చలికాలంలో పాదాలతో పాటు చేతులు కూడా పొడిబారిపోతుంటాయి. చేతులు పొడిబారకుండా వివిధ రకాల క్రీములు, బాడీ లోషన్లు రాసుకుంటూ ఉంటారు. వీటి వల్ల తాత్కలిక ఉపశమనమే లభిస్తుంది. మళ్లీ సమస్య పునరావృతమవుతుంది. ఇలా జరగకుండా చేతులు, గోళ్లకు పోషణను అందించాలంటే ‘మెనిక్యూర్’ పద్ధతి మంచిదని కొందరి అభిప్రాయం.
మెనిక్యూర్ పద్ధతిలో భాగంగా పారాఫిన్ మైనాన్ని ద్రవంగా మారేంత వరకు వేడిచేయాలి. కొద్ది సమయం వరకు ద్రావణాన్ని చల్లారనివ్వాలి. ఈలోపు చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆ తర్వాత చేతులను ఆ పారాఫిన్ మైనంలో ముంచి వెంటనే తీయాలి. ఇలా మైనం చేతులకు మందంగా అంటుకునేంత వరకు ఆ మిశ్రమంలో చేతులు పెడుతూ, తీస్తూ ఉండాలి.
ఆ తర్వాత గంట సేపటి దాకా చేతులకు మైనాన్ని అలాగే ఉంచుకొని అనంతరం తొలగించుకోవాలి. ఇప్పుడు లోషన్ రాసుకొని గ్లౌజులు వేసుకోవాలి. ఈ పద్ధతి చేతులతో పాటు గోళ్లకూ పోషణ అందించి మృదువుగా మార్చుతుంది. చలికాలం సమస్యలకు పరిష్కారం చూపే ఈ పద్ధతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.