రెండు, మూడుల రోజుల నుంచి చలి విపరీతంగా పెరిగిపోయింది. బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి చుక్కలు చూపిస్తోంది. దడ పుట్టిస్తున్న చలి కారణంగా బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యం ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దాదాపు 25 మంది చలి కారణంగా మృత్యువాత పడ్డారు. బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లతో ప్రాణాలు విడిచారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చలి మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చలినుంచి రక్షణ పొందటం తప్పని సరి అయింది. చలి నుంచి రక్షణ పొందాలంటే ఈ జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి.
నిండుగా, ఒత్తుగా బట్టలు ధరించటం
చలినుంచి రక్షణ పొందాలంటే నిండుగా, ఒత్తుగా బట్టలు ధరించటం తప్పనిసరి. వాతావరణాన్ని బట్టి వేసుకునే స్వెటర్ల సంఖ్యను పెంచుకోవాలి. ముఖానికి మంకీ క్యాప్, చేతులకు తొడుగులు ధరించాలి. ముక్కు, చెవుల్లోకి చల్లగాలి పోకుండా జాగ్రత్తపడాలి. వాటిని తప్పని సరిగా కప్పుకోవాలి. శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి.
పొడిగా ఉండాలి
చలికాలంలో వీలైనంత పొడిగా ఉండటానికి ప్రయత్నించాలి. తడిసిన దుస్తుల్ని అస్సలు వేసుకోకూడదు. ఒక వేళ నీటిలో తడిస్తే వెంటనే బట్టలు మార్చుకోవాలి. తల స్నానం చేసిన తర్వాత కుదుళ్లు పొడి అయ్యేవరకు బాగా తుడుచుకోవాలి. చల్ల నీటి స్నానం మానేయటం ఉత్తమం.
ఇంట్లోనే ఉండండి
చలి కాలంలో ఎక్కువగా బయట తిరక్కపోవటమే మంచిది. వీలైనంత ఇంట్లోనే ఉండాలి. అవసరం అయితే తప్ప బయటకు రాకూడదు. బయటకు వచ్చినా కూడా శరీరాన్ని పూర్తిగా కప్పుకుని బయటకు రావాలి.
చల్లటి ఆహారానికి దూరంగా ఉండాలి
చలి కాలంలో చల్లటి ఆహారానికి దూరంగా ఉండాలి. ఎప్పుడూ వేడిగా ఉన్న వాటినే తీసుకోవాలి. వీలైతే అప్పటికప్పుడు వండిన ఆహారాన్ని తీసుకోవాలి. చల్లటి నీళ్లు తాగటం మాని, గోరు వెచ్చటి నీళ్లు తాగాలి. ఫ్రిజ్ నీళ్లు అస్సలు తాగకూడదు.
ఇంటిని వెచ్చగా ఉంచుకోవాలి
కేవలం ఒంటిని మాత్రమే వెచ్చగా ఉంచుకుంటే సరిపోదు. ఇంటిని కూడా వెచ్చగా ఉంచుకోవాలి. ఏసీలు, కూలర్ల వాడకం బాగా తగ్గించాలి. ఇంటిని వేడిగా ఉంచే సాధనాలను ఉపయోగించాలి. చలిగాలి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. చలి ఎక్కువగా ఉంటే తలుపులు, కిటికీలు మూసివేయాలి.
నీళ్లు, ఆహారం
చలి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. సమతులమైన ఆహారం తీసుకోవాలి. శరీర అవసరానికి సరిపడా నీళ్లను తాగాలి. నీళ్లు దప్పిక కావటం లేదు కదా అని తాగటం మానేయకూడదు. గంటకు లేదా రెండు గంటలకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉండాలి. పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి.