కొన్ని కొన్ని దృశ్యాలు చూస్తుంటే భగవంతుడి స్వరూపమే ఆ రూపంలో వచ్చిందా అనిపించక మానదు. ఇటీవల దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణాన్ని ప్రతి రామాలయంలోనూ జరుపుకుని.. ఆనందించారు భక్తులు. అయితే ఓ గుడిలో జరుగుతున్నరాములోరి వివాహానికి వచ్చి.. అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాయి రెండు వానరాలు.
రామాయణ గాధలో సీతారాములు, లక్ష్మణుల గురించి ప్రస్తావించిన తర్వాత గుర్తుకు వచ్చే వ్యక్తి హనుమంతుడు. ఈయన లేనిదో రామాయణం లేదని హిందువులు విశ్వసిస్తుంటారు. రాముడిని నిత్యం స్మరిస్తూ.. అపర భక్తుడిగా పేరొందాడు ఆంజనేయుడు. ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని భావిస్తుంటారు భక్తులు. వానర రూపధారి అయిన ఈ అంజని సుతుడుని పూజిస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. ఆయనకు ప్రత్యేకంగా బ్రహ్మచారులు మంగళవారం పూజిస్తుంటారు. రామునికి తన గుండెల్లో స్థానం కల్పించిన వీర భక్తుడు ఆయన. అందుకే రాముడ్ని పూజిస్తే కచ్చితంగా హనుమంతుడ్ని ప్రసన్నం చేసుకున్నట్లని ప్రజలు నమ్ముతారు. భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్న రామాలయాలన్నీ రామ నామ స్మరణతో మారుమోగాయి. ప్రతి రామాలయంలోనూ సీతారాములకు పెళ్లిని జరిపించారు. తిలకించేందుకు రెండు కళ్లు చాలలేదు. అయితే ఓ పెళ్లిలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అనుకోని అతిధుల రూపంలో ప్రత్యక్షమయ్యాయి రెండు వానరాలు. ఈ అద్భుత ఘటన తెలంగాణలోని కొమురంభీం జిల్లాలో రెబ్బెన మండల కేంద్రంలోని రామాలయంలో చోటుచేసుకుంది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాములకు ఆ గుడిలో కళ్యాణం జరిపించారు. అయితే ఆ కళ్యాణానికి ఆ ఊరి ప్రజలే కాదూ రెండు వానరాలు అతిధులుగా వచ్చాయి. రాములోరి కళ్యాణం జరుగుతున్న సమయంలో అక్కడే ఉంది ఆ వివాహాన్ని కనులారా తిలకించాయి. అనంతరం సీతారాములను ఆశీర్వదించాయి.
హనుమంతుడు వాన రూపంలో వచ్చి ఇలా ఆశ్వీరదించాడని అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వీడియోను తీసిన భక్తులు నెట్టింట్లో పోస్టు చేయడంతో చూసిన వారంతా భక్తిభావంతో మునిగి తేలుతున్నారు. కళ్యాణ ముగిసిన అనంతరం.. పీట దగ్గరకు వెళ్లి వధూవరులైన సీతారాముల విగ్రహాల వద్ద ఉన్న అక్షింతలను చేతిలోకి తీసుకొని.. వాటిని విగ్రహాలపై వేసి ఆశీర్వదించాయి. అనంతరం మరి కొన్ని అక్షింతలను, పండ్లు ఫలాలను నోట్లో వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులంతా రాములోరి కళ్యాణానికి హనుమంతుల సైన్యం వచ్చిందని, భగవంతుడే స్వయంగా ఈ రూంపలో వచ్చి వారిని ఆశ్వీదించినట్లు చెప్పుకుంటున్నారు. హనుమంతుని రామ భక్తికి నిదర్శనం ఇదేనని అంటున్నారు.