సూర్యగ్రహణం.. ప్రస్తుతం అంతా ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. వెతుకులాట చేస్తున్నారు. గ్రహణం ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు వదులుతుంది? ఆ సమయంలో ఏం చేయాలి? ఏం తినాలి? ఎలాంటి పనులు చేయకూడదు? అనే విషయాలను బాగా వెతుకుతున్నారు. అయితే ఇంకో విషయం చాలా మందికి తెలియదు. గ్రహణం సమయంలో పట్టు- విడుపు స్నానాలు ఎందుకు చేయాలి? గ్రహణం వీడిన తర్వాత తలస్నానం చేయాలని ఎందుకు చెబుతుంటారు? ఈ విషయాల గురించి వీలైనంత వరకు తగిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈసారి వస్తున్న సూర్యగ్రహణం.. పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. భారత్ సహా ఐరోపా, పశ్చిమాసియా, ఈశాన్య ఆఫ్రికన్ దేశాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. సాయంత్రం 5.01 గంటల నుంచి 6.26 గంటల వరకు గ్రహణం సమయంగా చెబుతున్నారు. ప్రాంతాల వారీగా ఈ సమయం కాస్త మారే అవకాశం ఉంటుంది. పండితులు, జ్యోతిష్యుల చెప్పేదాని ప్రకారం గ్రహణం సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. గ్రహణం కంటే ముందే ఆహారం తీసుకుని ఆ సమయంలో ఖాళీగా ఉండాలి. బయట తిరగకూడదు, ఇంట్లోకి సూర్య కిరణాలు పడకుండా తలుపులు, కిటికీలు మూసేయాలి. గ్రహణం తర్వాత ఇంట్లో ఉన్న ఆహారాన్ని తినకూడదు. తర్వాత మళ్లీ వండుకుని తీసుకోవాలని చెబుతున్నారు.
సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం.. గ్రహణం ఏదైనా కావొచ్చు దానిని అశుభ కాలంగా చెబుతుంటారు. ఆలయాలను సైతం ఆ సమయంలో మూసివేస్తారు. గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ చేస్తారు. అలాగే గ్రహణం వీడిన తర్వాత స్నానాలు ఆచరించి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలని చెబుతారు. గ్రహణ సమయంలో పట్టు- విడుపు స్నానాలకు ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణం పట్టే సమయానికి ముందు స్నానం ఆచరించి.. ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండాలని సూచిస్తారు. గ్రహణం వీడిన తర్వాత తలస్నానం చేయాలని చెబుతారు. అలా చేయడం ద్వారా గ్రహణం సమయంలో మీరు తెలియక ఏదైనా పొరపాటు చేసినా, మీపై ఏదైనా చెడు ప్రభావం పడినా ఆ స్నానం వల్ల తొలగిపోతాయని చెబుతారు. అయితే గ్రహణం వీడిన తర్వాత పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఇంకా మంచిదని చెబుతుంటారు. ఇంటిని శుభ్రం చేసే సమయంలో గంగాజలాన్ని కలిపితే ఇంకా మంచిది.