గణపతి అటు జంతువు శిరస్సు కలిగి, ఇటు మానవ శరీరం కలిగి ఉంటారు. దీని వెనుక ఒక మూడు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ప్రకృతీ పురుషాత్మక అబేధ ఆకృతి ధరః గజాననః. గణపతిని కంఠం నుండి కాలి వరకూ అమ్మ వారు తయారుచేస్తే, ఆ ఏనుగు శిరస్సును శివుడు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ గణపతి శరీరం వెనుక స్త్రీ, పురుష తత్వాలు కలిసి ఉన్నాయి. ప్రకృతీ పురుషాత్మక అబేధ ఆకృతి ధరః గజాననః అని ఉపనిషత్తుల్లో ఉంటుంది. ప్రకృతి తత్వమైన అమ్మవారు శరీరాన్ని ఇస్తే.. పురుష తత్వమైన పరమశివుడు శిరస్సుని అంటే జ్ఞానాన్ని ఇచ్చారు. జ్ఞానంతోనే శరీరం పనిచేస్తుంది. ప్రకృతి స్త్రీ తత్వం అయితే, ఆ ప్రకృతిని నడిపించే పురుష తత్వం శక్తి. పదార్థం, శక్తి ఆంగ్లంలో మ్యాటర్, ఎనర్జీ అని అంటారు. ఈ రెండూ కలిస్తే వచ్చేదే బ్రహ్మ పదార్థం. ఈ పదార్థం, శక్తి అనేవి గణపతి స్వరూపంలో స్పష్టంగా కనబడతాయి. కంఠం కింద ఉన్న స్వరూపాన్ని జగం అని, కంఠంపై ఉన్న శిరస్సు భాగాన్ని గజం అంటారు. ప్రకృతీ పురుషాత్మక తత్వాన్ని సూచించడం కోసం ఈ ఏనుగు తలని పెట్టడం జరిగిందని ఒక తాత్పర్యం.
ఏనుగు తలనే ఎందుకు పెట్టడం, గణపతి శిరస్సునే మళ్ళీ పెట్టవచ్చు కదా.. అనే సందేహం రావచ్చు. అయితే దీని వెనుక మరొక రహస్యం ఉంది. పూర్వం ఏనుగు రూపంలో గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను గొప్ప శివ భక్తుడు. ఘోర తపస్సు చేసి శివుడిని తన కడుపులో ఉంచుకోవాలనుకున్నాడు. శివుడు కడుపులో ఉంటే లోకాధిపతి అవ్వాలని కుట్ర పన్నుతాడు. ఘోర తపస్సు చేయగా.. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అంటాడు. దానికి ఆ గజాసురుడు, ఆత్మలింగంలా తన కడుపులో ఉండాలని శివుడ్ని కోరుకుంటాడు. ఆడిన మాట తప్పని శివుడు, గజాసురుడి కోరిక మన్నించి అతని కడుపులో నివసిస్తాడు. ఆ తర్వాత పార్వతి దేవి విష్ణుమూర్తికి జరిగింది వివరిస్తుంది. విష్ణుమూర్తి శివుని వాహనమైన నంది, బ్రహ్మ, ఇతర దేవతలను వెంటబెట్టుకుని గజాసురిడి దగ్గరకు వెళ్తాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి, డూ డూ బసవన్నలా విష్ణుమూర్తి, ఇతర దేవతలు తయారై అక్కడ నృత్యం చేసి గజాసురుడిని మెప్పిస్తారు. (ఇక్కడి నుండే సంక్రాంతికి గంగిరెద్దుతో బసవన్న ఇంటింటికీ తిరిగే సాంప్రదాయం వచ్చిందని అంటారు).
గంగిరెద్దుతో విష్ణుమూర్తి చేసిన సన్నాయి మేళం గజాసురుడికి నచ్చడంతో ఏ వరం కావాలో కోరుకోమని అంటాడు. దానికి విష్ణుమూర్తి.. గంగిరెద్దుని చూపించి అది శివుని వాహనమైన నంది, శివుడ్ని చూడాలని వచ్చింది, దానికి శివుడ్ని చూపిస్తే వెళ్ళిపోతామని అంటాడు. అప్పుడు గజాసురుడికి ఆంతర్యం అర్ధమవుతుంది. వచ్చింది విష్ణువని తెలుసుకుంటాడు. కడుపులో ఉన్న శివయ్య బయటకు రాలేడు. వస్తే తాను చనిపోతాడని తెలుసు. రాక్షసుడైనప్పటికీ ఆడిన మాట తప్పడం క్షత్రియ లక్షణం కాదు కాబట్టి చావడానికి సిద్ధపడతాడు. అయితే చనిపోయే ముందు శివుడ్ని ఒక వరం కోరుకుంటాడు. తాను మరణించాక తన తలను మూడు లోకాలలో పూజించేలా చేసి, తన చర్మాన్ని శివుడ్ని ధరించమని కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు. విష్ణువు వెంటనే నందికి సైగలు చేయగా.. నంది తన కొమ్ములతో గజాసురుడి కడుపులో పొడిచి చీల్చుతుంది. దీంతో శివుడు బయటకి వస్తాడు. గజాసురుడి కోరిక మేరకు ఏనుగు తలను తన కొడుకు వినాయకుడి శిరస్సుని చేధించిన అనంతరం పెట్టాల్సి వస్తుంది. విధి అంటారు. అది ఇదే. ప్రతీ చర్య వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది.
ఇదే కాకుండా మరొక కారణం కూడా ఉంది. బ్రహ్మ ధ్యానంలో ఉండగా ఆయనకి మొట్టమొదటిగా దర్శనమిచ్చింది గజ స్వరూపం అని చెబుతారు. మూడు అంకెలోంచి ఏనుగు తొండంలా ఒకటి వచ్చి, పైన అర్థ చంద్రాకారం ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ఉంటుంది ఈ ఓంకారం. ఈ ఓంకార తత్వానికి సంకేతమే గజ వదనం అని అంటారు. ఈ కారణంగా గణపతికి గజ శిరస్సుని అమర్చడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. గజాసురుడిని వధించి ఆ తలను గణపతికి అమర్చడానికి ఇదొక కారణమని చెప్పవచ్చు.
అయితే గణపతికి ఏనుగు తల పెట్టడం వెనుక సైన్స్ ఉందనేది ఒప్పుకోక తప్పని సత్యం. ఇందులో ఉన్న సైన్స్ మానవాళికి సాధ్యం కాదు. ఇప్పుడున్న శాస్త్రవేత్తలు దీని కోసం పరిశోధనలు చేస్తున్నారు. అదే తల మార్పిడి. ఇంగ్లీష్‌లో హెడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని అంటారు. కొంతమంది శాస్త్రవేత్తలు జంతువుల మీద ప్రయోగాలు చేశారు. ఒక జంతువు తలను మరొక జంతువుకి సర్జరీ చేసి చూశారు. కానీ ఏ జంతువూ బతకలేదు. కానీ శివుడు చేసిన మొట్టమొదటి హెడ్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతమైంది. ఇది కట్టు కథే అయినప్పటికీ ఆ కథని రాసిన వ్యక్తికి ఈ ఆలోచన రావడం గొప్ప కదా. అది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇప్పుడున్న శాస్త్రవేత్తలే కన్న కలలను నిజం చేసుకుంటున్నారంటే అప్పటి తరం వారు కన్న కలలను నిజం చేసుకోకుండా ఎలా ఉంటారు. పైగా ఇప్పుడున్న టెక్నాలజీ కంటే మోస్ట్ అడ్వాన్సిడ్ టెక్నాలజీ అప్పట్లో ఉండేదని పురావస్తు శాఖ వారే చెబుతున్నారు. మరి శివుడు హెడ్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకుండా ఉంటాడని ఎలా నమ్మగలం.
ఆ రకంగా శివుడు చేసిన ఈ హెడ్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స అని శాస్త్రవేత్తలు చెబుతారు. ఇదొక్కటేనా దీని తర్వాత శివుడు మరో శస్త్ర చికిత్స చేశాడు. తన మామ పార్వతి దేవి తండ్రి దక్ష ప్రజాపతికి మేక తలని అతికిస్తాడు. యజ్ఞం నిర్వహిస్తున్న దక్షుడి ఇంటికి పార్వతి, శివుడు వెళ్తారు. అప్పుడు శివుడ్ని దక్షుడు అవమానిస్తాడు. అవమానం భరించలేక పార్వతి అగ్ని హోమ గుండంలో దూకుతుంది. అప్పుడు శివుడు దక్షుడి తలని చేధిస్తాడు. ఆ తర్వాత అందరూ బతికించమని వేడుకోగా అప్పటికప్పుడు సమీపంలో ఉన్న మేకల్లో ఒక మేక తలని అమర్చుతాడని వామన పురాణంలో ఉంది. ఇక్కడి నుండే బలులు వచ్చాయని చెబుతారు. ఏది ఏమైనా గానీ శివుడు దేవుడు మాత్రమే కాదు, గొప్ప శాస్త్రవేత్త అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదీ గణపతికి ఏనుగు శిరస్సు అమర్చడం వెనుక ఉన్న రహస్యం. దీనిపై మీ అభిప్రాయన్ని కామెంట్ చేయండి.