తిరుమలకు వెళ్తే భక్తుల్ని టీటీడీ అప్రమత్తం చేసింది. ఆగష్టు 11 నుంచి 15 వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని కోరుతోంది. తిరుమలకు వచ్చే భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
వారాంతంపు రద్దీతో పాటు పండుగలతో వరుస సెలవులు వచ్చాయంటోంది టీటీడీ. ఆగస్టు 19 వరకు సెలవులు కొనసాగుతాయని.. పైగా పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 17వ ముగుస్తుందని గుర్తు చేసింది. ఈ మధ్య కాలంలో తిరుమల యాత్రికుల రద్ధీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ హెచ్చరించింది. ఈ కారణంగా వీలుంటే వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమలకు పెరటాసి మాసం అనంతరం రావలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
మంగళవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మొత్తం 29 కంపార్ట్‌మెంట్‌లు నిండి బయట 2 కిలోమీటర్ల మేర భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 14 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శ్రీవారి పవిత్రోత్సవాల సందర్భంగా దర్శన వేళల్లో మార్పులు చేశారు. పవిత్రోత్సవాల సందర్భంగా దర్శనం ఆలస్యమయ్యే అవకాశం ఉందని టీటీడీ చెబుతోంది. భక్తులు సహకరించాలని కోరింది.