ముస్లింలకు పవిత్ర మాసం అయిన రంజాన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో హైదరాబాద్ మహానగరంలో కొన్ని మస్జీద్‌లు పండుగ శోభను సంతరించుకోనున్నాయి.
పవిత్ర రంజాన్ మాసం శుక్రవారం తొలి ఉపవాస దీక్షతో ప్రారంభం కానుంది. క్యాలెండర్ ప్రకారం రంజాన్ మాసం గురువారం నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా.. నెలవంక కనిపించకపోవడంతో ఒక రోజు ఆలస్యంగా రంజాన్ మాసం ఆరంభం కానుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో నిష్టతో కఠిన ఉపవాస దీక్షలు పాటించడంతో పాటు రోజూ ఐదు సార్లు నమాజ్‌తో పాటు ప్రత్యేకమైన తరాహ్‌వీ నమాజ్‌ను కూడా ఆచరిస్తారు. దీంతో.. ఉపవాస దీక్షలో ఉన్న వారి నమాజ్‌లతో హైదరాబాద్ నగరంలోని మస్జీద్‌లు కిటకిటలాడనున్నాయి. నిత్యం కంటే.. రంజాన్ మాసంలో మస్జీద్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులో ప్రముఖంగా కొన్ని మస్జీద్‌లు ఏవంటే..?
1. మక్కా మస్జీద్/చార్మినార్
హైదరాబాద్‌లో చాలా పురాతనమైన మస్జీదుల్లో చార్మినార్‌లోని మక్కా మస్జీద్ కూడా ఒకటి. దాదాపు 300 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మస్జీద్‌లో ఏకకాలంలో 20 వేల మంది నమాజ్‌ను ఆచరించే సౌలభ్యం ఉంది. హైదరాబాద్‌కు పర్యాటకులు మక్కా మస్జీద్‌ను కూడా సందర్శిస్తుంటారు. రంజాన్ మాసంలో అయితే.. మక్కా మస్జీద్‌లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉపవాస దీక్షను విడిచే సమయంలో అయితే.. జనం కిక్కిరిసిపోతారు. పక్కనే చార్మినార్
సైతం ఉండటంతో అక్కడి వచ్చే జనాలతో రద్దీ మరింత అధికం అవుతుంది.
2. టోలీ మస్జీద్
ఇది మస్జీద్ కూడా 300 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ మస్జీద్ కుతుబ్ షాహీ నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ. ఈ మస్జీద్‌ను మీర్ మూసా ఖాన్ మహల్దార్ నిర్మించారు. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టోలీ మసీదును వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రంజాన్ మాసంలో ఈ మస్జీద్‌లో కూడా భారీ రద్దీ ఉంటుంది.
3. కుల్సుమ్ బేగం మస్జీద్
కుల్సుమ్ బేగం మస్జీద్ కార్వాన్‌లో ఉంది. దీన్ని 17వ శతాబ్దంలో గోల్కొండ ఆరవ పాలకుడు సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షా కుమార్తె కుల్సుమ్ బేగం నిర్మించారు. దీన్నే బడి మసీదు అని కూడా అంటారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు విడిచే సమయంలో ఇక్కడ జనసందోహంగా ఉంటుంది.
పవిత్ర రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం అవుతుందని ఢిల్లీలోని నెలవంక వీక్షణ కమిటీ ప్రకటించింది.#Ramadan #Ramadan2023 pic.twitter.com/sdd7vcTALn
— AIR News Hyderabad (@airnews_hyd) March 23, 2023