ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మరాయి. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపు.. వైసీపీలో పెద్ద కుదుపును తెచ్చింది. దీంతో ఈ విజయంపై అధిష్టానం కూడా గుర్రుగా ఉంది. ముఖ్యంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మాత్రం తమ నేత ఓటమిపై గుర్రుగా ఉన్నారు. విధేయులే వెన్నుపోటు పొడవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లు తమవేనని భావించిన వైఎస్సాఆర్సీపీకి చుక్కెదురైంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో గెలవడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారి కలవరం రేగింది. ముఖ్యంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచిన ఆనందం కన్నా ఈ ఒక్క స్థానం కోల్పోయామన్న అసంతృప్తి వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అయితే వైసీపీలో నమ్మకస్థులైన ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ ద్వారానే ఇదంతా జరిగిందని భావించిన వైసీపీ అధిష్టానం.. నలుగురిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. వారిలో ఆనం నారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డిని పార్టీ నుండి వైఎస్సాఆర్సీపీ సస్పెండ్ చేసింది. అయితే వీరిలో ఆనం, కోటం రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీతో విబేధిస్తూ ఉన్నారు. అయితే వీరిపై ఎటువంటి విచారణ జరపకుండా తక్షణమే చర్యలు తీసుకోవడం మాత్రం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే చెల్లింది.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయంపై పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా గడవకుండానే దీనికి కారణమైన నలుగుర్ని తొలగించి పెను సంచలనం అయ్యారు. మామూలుగా జగన్ విశ్వాసానికి పెద్ద పీట వేస్తారు. ఆయన పాల పొంగులాంటి వారని పార్టీ శ్రేణులు చెబుతుంటాయి. ఎంత శాంతియుతంగా ఉంటారో.. కొన్ని విషయాల్లో కోపాన్ని ప్రదర్శించకుండా ఉండలేరు. పార్టీకి విధేయులుగా ఉన్నవారిని ఎన్నటికీ విడిచి పెట్టరు. తనను నమ్మిన వారిని కాదనకుండా పార్టీలోకి ఆహ్వానించిన ఆయన.. పలువురికి పెద్ద పీట వేశారు. వారిలో బొత్స సత్యనారాయణ, ఆనం నారాయణ రెడ్డి వంటి ప్రముఖులే కాదూ.. చాలా మంది ఉన్నారు. పార్టీలో విశ్వాసంగా ఉంటూ చురుకైన పాత్ర పోషించిన సామాన్యులను సైతం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి.. అసెంబ్లీలో కూర్చొబెట్టారు. కేవలం తన చరిష్మాతో వారిని గెలిపించిన ఘనత ఆయనదే. తన తండ్రి రాజశేఖర్ రెడ్డిలానే.. పార్టీలో కష్టించి, శ్రమించే వాళ్లను ఎమ్మెల్యేలుగా చేయడమే కాదూ మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఒక్క విజయంతో ఆయన కోపం లైన్ దాటేసినట్లు కనిపిస్తుంది.
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లన్నీ తమవేనని, వారిని గెలిపించే బాధ్యతలను పలువురు నేతలకు అప్పగించారు జగన్. అయితే సొంత పార్టీ నేతలే ఆయనకు వెన్ను పోటు పొడవడంతో తక్షణమే చర్యలకు ఉపక్రమించారు. ఇతర పార్టీల్లో ఇలా క్రాస్ ఓటింగ్ జరిగిందంటే..అసలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని లేదంటే అంతర్గత కమిటీ వేశాక.. నిజ నిర్ధారణ తేలాక .. ఆయా నేతలపై వేటు ఉంటుంది. కానీ వైసీపీలో అలా జరిగినట్లు లేదు. కేవలం జగన్ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆ నలుగురిపై తక్షణ వేటు పడినట్లు కనిపిస్తోంది. ఇది మరికొంత మంది రాజకీయ నేతలకు కూడా గుణ పాఠం కావాలన్న ఉద్దేశంతో ఈ త్వరితగతిన చర్యకు దిగినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కూడా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తో్ంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అమ్మడుపోయారని బలంగా నమ్ముతున్న వైసీపీకి ఇది పెద్ద దెబ్బే. అందుకే విధేయులను నెత్తిమీద పెట్టుకునే వ్యక్తిత్వం ఉన్న ఆయన.. రాజకీయ ద్రోహులపై వేటు వేయడానికి వెనుకాడలేదని సమాచారం. ఇదే ఆయనకే చెల్లిన రాజకీయమని తెలుస్తోంది.