ప్రతీ మనిషికీ కావాల్సింది డబ్బే కదండీ. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అన్నారు. డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తోంది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని జర్మన్ తత్వవేత్త కారల్ మార్క్స్ ఊరికే అనలేదు. అది నిజమే. ఈరోజుల్లో ఏది నిలబడాలన్న డబ్బు ఉండాలి. మనుషుల మధ్య ప్రేమ, బంధాలతో పాటు అవి నిలబడేందుకు ఖచ్చితంగా డబ్బు కావాలి. అయితే లలిత జువెల్లరీ గుండు బాస్ చెప్పినట్టు డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. కొంతమంది ఎంత కష్టపడుతున్నా చాలీ చాలని డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. సాయంత్రం 6 దాటాకా లుంగీ ఎగ్గొట్టుకుని.. బావమరిదితోనో, స్నేహితుడితోనో.. మనకీ ఒక రోజు వస్తుంది. డబ్బు సంపాదిస్తాం. ఈ ఆర్ధిక ఊబి నుంచి బయటపడతాం. పడకుండా ఉంటామా? అని చెప్పుకుంటారు. దేనికైనా అదృష్టం ఉండాలని అనుకుంటారు. రాసి పెట్టి ఉండాలని అంటారు. మరి ఆ అదృష్టం మన తలుపు ఎప్పుడు తడుతుంది? మన జీవితం సుడి తిరుగుతుందని ఎప్పుడు అనిపిస్తుంది? ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా?
హిందువులు లక్ష్మీదేవిని విపరీతంగా ఆరాధిస్తారు. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. మిగతా రోజుల్లో కంటే శుక్రవారం పూట ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుతారు. ఆరోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి.. లక్ష్మీదేవిలా ముస్తాబయ్యి.. వాకిట్లో కల్లాపు చల్లి.. ముగ్గు పెట్టి.. లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం అంటే లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతారు. ఇంటిని ఇలా శుభ్రపరిచి.. వాకిట్లో ముగ్గు పెట్టే ఇళ్ళకి లక్ష్మీదేవి వస్తుందని పెద్దలు చెబుతారు. పల్లెటూర్లలో గుమ్మం నుంచి చూస్తే పెరట్లో అరటి చెట్టు, తులసి మొక్క కనిపించే విధంగా పెట్టుకుంటారు. ఇలా ఉంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట.
అంతేకాదు కుటుంబంలో అందరూ ఆనందంగా, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుంటే అక్కడ ఆ చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని అంటారు. అందుకే స్త్రీలు ఉదయాన్నే లేచి ఇల్లూ, గుమ్మాలు ఊడ్చి, తలస్నానం చేసి లక్ష్మీదేవిలా తయారవుతారు. వారిని అలా చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. శుభ్రంగా లేకపోతే ఇంటికొచ్చే లక్ష్మీదేవి అటు నుంచి అటే వెళ్ళిపోతుందని అంటారు. లక్ష్మీదేవిని సంపద లక్ష్మిగా, డబ్బుగా కొలుస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే సిరి, సంపదలు సిద్ధిస్తాయని నమ్ముతారు. డబ్బు కోసం ధనవంతులు సైతం నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తారు. పెద్ద పెద్ద ధనవంతులు, వ్యాపారవేత్తలు కూడా దైవభక్తి కలిగి ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు కూడా కింది స్థాయి నుంచి ఎదిగిన వారే. ప్రతీ ఒక్కరి జీవితంలో తమ జీవితం మలుపు తిరుగుతుందని సంకేతాలు ముందుగానే తెలుస్తాయని అంటారు. అలానే డబ్బు వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు తెలుస్తాయని అంటూ ఉంటారు.
కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది. కోకిల చేసే శబ్దం ధనానికి సూచికగా చెబుతారు. కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం, అశుభాలని గుర్తిస్తారు. ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుందని నమ్ముతారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుందని అంటారు. మధ్యాహ్నం పూట కోకిల కూత వినిపించినా శుభం జరుగుతుందని నమ్ముతారు. ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కోకిల కూసిన శబ్దం వినబడితే లాభాలు వస్తాయని, మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం.
ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తాం. ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మంచిదని శాస్త్రం చెబుతుంది. నోటితో బియ్యం, ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటారు. అక్షింతలు అనేవి శుభం కలగజేసేవి. లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. అక్షింతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడిపెడతారు. ఇక ఇంట్లో ఎర్ర చీమలు తిరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతారు.
బల్లి పడితే చిరాకు పడతాం. అశుభంగా భావిస్తారు. అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతారు. శాస్త్రం ప్రకారం కుడి చేతిపై పడి.. వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే.. త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్ధం. బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు.
పాము అంటేనే అసహ్యం వేస్తుంది. ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అని చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ పాములు శుభ సూచకమని కొంతమంది నమ్మకం. ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనబడితే.. మంచిది. చూసిన వారి ఇంటికి వెళ్లడం వల్ల కూడా శుభం జరుగుతుందని నమ్ముతారు. పాము కనిపిస్తే చంపకుండా.. బయటకు వెళ్లేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి తలుపు తడుతుందని విశ్వసిస్తారు.
లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి. రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ, కోపం వంటివి తగ్గుతాయి. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కలహాలకి స్పేస్ ఉండదు. మనస్పర్థలు, విబేధాలు, గొడవలు తగ్గి.. సంతోషంగా ఉన్నారంటే తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు భావిస్తారు.
పైన చెప్పినట్టు నిజంగానే జరుగుతాయా అంటే జరుగుతాయని కొంతమంది నమ్మకం. లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి ఏమీ మనకి రిజర్వ్ బ్యాంక్ లో ఉన్న కరెన్సీ నోట్లు పట్టుకొచ్చేయదు. కొత్తగా ప్రింట్ చేసి తీసుకొచ్చి ఇచ్చేది లేదు. కానీ మనకి సంపాదించుకునే శక్తిని మాత్రం ప్రసాదిస్తుంది. ఎనర్జీ ఉంటేనే కదా.. ఏదైనా క్రియ జరిగేది. ఈ సృష్టి మొత్తం శక్తి మీదనే నడుస్తోంది. డబ్బు మీద నడుస్తుందని సాధారణ మనుషులు అనుకుంటారు, అసాధారణ మనుషులు కేవలం శక్తి మీద నడుస్తుందని నమ్ముతారు. ఖర్చు పెట్టే శ్రమ శక్తి మీద తమ జీవిత రథం నడుస్తుందని భావిస్తారు. మన ఒంట్లో ఉన్న శక్తిని ఎలా ఖర్చు పెట్టామన్నదే ముఖ్యం. ఆ శక్తిని సమకూరడానికే భగవంతుడున్నది.
ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పనులు సజావుగా అవుతాయి. పనులు సజావుగా అయితే ప్రతిఫలం బాగుంటుంది. ఒక నమ్మకంతో ముందుకు వెళ్తే.. అంతా మంచే జరుగుతుంది. శాస్త్రాలను, పూర్వీకుల మాటలను నమ్మడం వల్ల మోసపోవడం అయితే జరగదుగా. కుదిరితే భగవంతుడ్ని నాకు డబ్బులు ఇవ్వు, ఐశ్వర్యం ఇవ్వు, లేకపోతే కారు, బంగ్లాలు ఇవ్వు అని కాకుండా.. దేన్నైనా సంపాదించుకునే శక్తిని ఇవ్వు అని కోరుకుంటే ఇవ్వకుండా ఉంటాడా?