మార్చి 24, శుక్రవారం నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. ముస్లింలకు రంజాన్ పండుగ ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు. నెలరోజుల పాటు ఉపవాసం ఉండి చివరి రోజును నెలపొడుపుని చూసి తర్వాత రోజు పండుగ చేసుకుంటారు. అసలు ఈ రంజాన్ ఉపవాసాలు ఎలా పాటిస్తారో చూద్దాం.
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించిన నెలగా రంజాన్‌తో ఎంతో పవిత్రంగా, కఠిన ఉపవాస దీక్షలతో ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటారు. నెల రోజులు పండుగ వాతావరణం నెలకొంటుంది. మస్జీద్‌ల వద్ద పండుగ శోభ సంతరించుకుంటుంది. అయితే.. ఈ రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారు. అవి చాలా కఠినంగా ఉంటాయని మనం ఇప్పటికే చాలా సార్లు విన్నాం. కానీ.. అసలు ఎందుకంత కఠినంగా ఉంటాయి. ఉపవాసాన్ని ఎలా, ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎలా, ఎప్పుడు ముగిస్తారు. ఉపవాసంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముస్లింలు ప్రతి రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తారనే విషయం తెలిసిందే. వాటిని ఫజర్, జొహర్, అసర్, మగ్రీబ్, ఇషా అని పిలుస్తారు. వీటిని ఉపవాస దీక్షల సమయంలోనూ కొనసాగిస్తూ.. రంజాన్ సందర్భంగా ప్రత్యేకమైన తరావీహ్ నమాజ్‌ను ఆచరిస్తారు. రోజాలో సూర్యోదయానికి ముందు తినే ‘సహరీ’ అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరపు పండు గానీ ఇతర పండ్లు ఏవైనా తిని ‘ఇఫ్తారీ’ అంటారు. సహరీ నుంచి ఇఫ్తారీ వరకు రోజా ఉండేవాళ్లు.. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. అలాగే ఉమ్మిని కూడా మింగకూడదు. అలాగే ఈ నెలలో దానధర్మాలు కూడా బాగా చేస్తుంటారు. రంజాన్ నెలలో పేదలను ఆదుకోవాలని ఖురాన్ బోధిస్తోంది.