ఈ బ్రహ్మాండం అంతట్లో కూడా వేంకటాద్రి ని పోలిన మరొక స్థలం లేదని, అలాగే వెంకటేశ్వర స్వామి ని మించిన దైవం ఇంతకు ముందు లేదు, ఇకపై రాడు అని భవిష్యోత్తర పురాణం లో చెప్పబడింది. ఆపద మొక్కులవాడు అని, భక్తుల పాలిట కొంగుబంగారమని అంటుంటారు. నిరుపేదల నించి అపర కుబేరులవరకు ఆయన ఆపద్భాంధవుడే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. తిరుమల దివ్యక్షేత్రం ఈ శ్రావణమాసంలో మరింత శోభతో అలరారుతుంది.
పౌర్ణమి నాడు స్వామి వారు గరుడునిపై తిరుమాఢవీధుల్లో విహరిస్తారు. అయితే ఈ ఆగస్టు నెలలో మాత్రం స్వామి వారికి రెండుసార్లు గరుడ సేవ నిర్వహించనున్నారు దేవస్థానం అధికారులు. ముందుగా ఆగస్టు 13వ తేదీన శుక్రవారం రోజున గరుడ పంచమి పర్వదినం తిరుమలలో జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారు భక్తలను అనుగ్రహిస్తారు. ప్రతీ ఏడాదీ తిరుమలలో గరుడ పంచమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడ పంచమి పూజ చేస్తారని ప్రాశస్త్యం. స్వామి వారి దర్శనం అత్యంత రమణీయం. మనోహరం. కమనీయం. స్వామి సేవలో తరించేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు.
పవిత్రోత్సవం శ్రావణమాసంలో ఏకాదశి నుండి త్రయోదశి వరకు మూడు రోజులు తిరుమల ఆలయంలో జరుగుతుంది. ఏకాదశినాడు పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ద్వాదశినాడు ఉత్సవ మూర్తులకు పవిత్ర సమర్పణ, త్రయోదశినాడు పూర్ణాహుతితో ఉత్సవం ముగుస్తుంది. మలయప్ప స్వామికి, ఉభయ దేవేరులకు పవిత్రమాలలను వేసి ఊరేగించడంతో జరిగిన దోషం పరిహారమౌతుంది. కొవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల తిరుపతి ప్రాశస్థ్యాం గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో వీక్షించండి.