జాతకంలో ఏలినాటి శని, శని దోషాలు ఉన్నవారు వాటి నుంచి విముక్తి పొందేందుకు ప్రత్యేకమైన రోజు వస్తుంది. అదే శని త్రయోదశి. ఈ రోజున శని దేవుడుని ప్రసన్నం చేసుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
కొంతమంది వ్యక్తులు వారు అనుకున్న పనులు నెరవేరక, వృత్తి వ్యాపార రంగాల్లో కలిసి రాక నష్టాలను చవిచూస్తుంటారు. తమకు ఏం జరుగుతుందో తెలియక మనోవేధనకు గురవుతుంటారు. కష్టాల నుంచి గట్టెక్కేందుకు దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు. భగవంతుడికి తమ సమస్యలను చెప్పుకుని ముడుపులు కడుతుంటారు. జ్యోతిష్యుల వద్దకు వెళ్లి జాతకాలను చెప్పించుకుంటారు. ఫైనల్ గా శని ప్రభావం వల్ల తమ జీవితాల్లో ఏ పని కలిసి రావడంలేదని తెలుసుకుంటారు. శని పీడ తొలగించుకోవడం కోసం శని దేవుడికి పలు రకాల పూజలు చేస్తుంటారు. అయితే శని పూజ ఏరోజు చేయాలి? నియమాలేంటి? ఎలా పూజిస్తే శని పీడ పోతుంది అనే విషయాలు తెలుసుకుందాం.
శని ప్రభావంతో ఉద్యోగం ఆలస్యం అయ్యేవారు, వివాహాలు ఆలస్యమయ్యేవారు, వృత్తి వ్యాపారాల్లో కలిసి రానివారు శనికి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ శని పూజలు శని త్రయోదశి రోజు చేస్తే ఎక్కువ ఫలితాన్నిస్తాయని నమ్ముతారు. సాధారణంగా శనివారం రోజున వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అంటారు. ఆ రోజు శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న శని త్రయోదశి రేపు (జూలై 1) న వస్తుంది. కాబట్టి వివిధ సమస్యలతో సతమతమయ్యే వారు శని త్రయోదశి రోజు పూజలు నిర్వహించి శని బాధ తొలగించుకోవచ్చు.
శని త్రయోదశి నాడు ఇలా చేయాలి..
జాతకంలో శని దోషం ఉన్న వారు శని త్రయోదశి నాడు సూర్యోదయాని కంటే ముందుగానే నిద్ర లేచి తల స్నానం చేసి దగ్గర్లో ఉన్న శని దేవుడు ఉండే ఆలయానికి వెళ్లాలి. శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రం శనిదేవునికి ధరింపచేసి, నవధాన్యాలు, పూలు, పండ్లు సమర్పించాలి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రాన్ని దానం చేయాలి. పురాణాల ప్రకారం శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై ఉంటారని పేర్కొంటున్నాయి. కాబట్టి ఆ రోజున అశ్వత్థ వృక్షాన్ని సందర్శించుకుని దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి నాడు ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందని పండితులు అంటుంటారు. శని దేవుడు జాతక రీత్య ఎన్ని ఇబ్బందులు కలిగిస్తాడో అంత మేలును కూడా చేస్తాడని హింధూ దర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి శని త్రయోదశి నాడు శనేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి ఏలినాటి శని, ఇతర దోషాల నుంచి విముక్తి కలిగించుకోవచ్చును.
శని బాధలు తీరేందుకు ఈ స్తోత్రం చదవాలి
‘నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్..
ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్’