మన దేశంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని ఎంత ఘనంగా జరుపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి పర్వదినం. మరి ఆ పండుగ ప్రత్యేకతలు, పూజా విధానం వంటి వివరాలు..
చిన్నారులు మొదలు పెద్దలు వరకు ప్రతి ఒక్కరికి ఇష్ట దైవం హనుమంతుడు. జీవితంలో ఏ సమయంలోనైనా భయం వేస్తే.. ఒక్క సారి శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం అనుకుంటే.. చాలు.. కొండంత ధైర్యం, ఎక్కడా లేని బలం వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా నిలిచాడు హనుమంతుడు. అలాంటి ఆంజనేయుడి జన్మదినం సందర్భంగా మన దేశంలో హనుమాన్ జయంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం, ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడని చెబుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన హనుమాన్ జయంతి వచ్చింది. ఈ పండుగ ప్రాధాన్యత, పూజా విధానం వంటి వివరాలు..
హనుమంతుడు వానర రాజు కేసరి, తల్లి అంజనీదేవికి జన్మించినట్లు పండితులు చెబుతారు. హనుమంతుడిని పరమేశ్వరుడి అవతారంగా కీర్తిస్తారు. శ్రీరాముడికి సేవ చేసేందుకే శివుడు హనుమంతుడి అవతారంలో జన్మించాడని నమ్ముతారు. శ్రీరాముడికి ఎంతో విశ్వాసపాత్రుడిగా, నమ్మిన బంటుగా ప్రసిద్ధి గాంచాడు హనుమంతుడు. ఇక ఈసారి హనుమాన్ జయంతిని హర్ష యోగంలో నిర్వహించనుడం మరింత విశేషంగా భావిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున హస్తా, చిత్ర నక్షత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు.
హనుమాన్ జయంతి రోజున మీకు సమీపంలోని ఏదైనా ఆంజనేయుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత గుడిలో హనుమంతుని ముందు నెయ్యి, నూనెతో దీపం వెలిగించాలి. అనంతరం భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడు సంతోషించి, కోరిన కోర్కెలు తీరుస్తాడని చాలా మంది నమ్ముతారు. అంతేకాక భక్తి శ్రద్ధలతో ఆంజనేయుడిని పూజిస్తే శని దోషం నుంచి విముక్తొ పొందొచ్చని చాలా మంది నమ్మకం. నిద్రపోయే సమయంలో, ప్రయాణాల్లో హనుమంతుడిని స్మరిస్తే.. చావు గురించి భయం ఉండదు అంటారు. ఈ రోజు హనుమాన్‌కి పూజలు చేసి.. ఆరాధిస్తే.. శని బాధలు తొలగడమే కాక.. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భూత ప్రేత పిశాచ భయాల నుంచి విముక్తి కలుగుతుందని.. సకల శుభాలు చేకూరతాయని పండితులు చెబుతున్నారు.